ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఈ పవర్ ఫుల్ డైలాగ్ యూపీ సీఎం యోగికి అక్షరాలా అతికినట్టు సరిపోతుంది. బడ్జెట్ సమావేశాల వేళ ఆ రాష్ట్ర రాజకీయాన్ని షేక్ చేసేసిన ప్రయాగ్ రాజ్ మర్డర్ ఎపిసోడ్‌పై ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ అలానే ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఈ ఇష్యూతో ఆదిత్యనాథ్ సర్కార్‌ను అటాడేద్దామనుకున్న అఖిలేష్ అండ్ టీమ్‌కు.. అంతకుమించన వ్యూహాలతో, అసలైన యాక్షన్‌తోనే ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తున్నారు.అసెంబ్లీలో వేలు చూపించి మరీ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ సమాజ్‌వాదీ పార్టీనే అని విమర్శించిన బీజేపీ.. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ మర్డర్ కేసు నిందితుడితో అఖిలేష్ దిగిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆ నిందితుల్లో ఒకరిని ఎన్‌కౌంటర్‌లో లేపేసింది. ఇది జరిగిన తర్వాత ఏకంగా బుల్డోజర్లనే రంగంలోకి దించి ప్రతిపక్ష ఎస్పీకి, క్రిమినల్స్‌పై తాము యాక్షన్ తీసుకుంటే సీన్ ఇంత సీరియస్‌గా ఉంటుందంటూ సంకేతాలు పంపింది. ఈ మొత్తం పరిణామాలతో యోగి ఆదిత్యనాథ్ మరోసారి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుతం జైలులో ఉన్న అతిక్ అహ్మద్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో కీలక సాక్షి అయినా ఉమేశ్ పాల్‌నే ఫిబ్రవరి 24న కాల్పులు జరిపి, హత్య చేశారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సందీప్ నిషాద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ఉమేశ్ హత్య కేసులో కూడా అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంటూనే ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్‌పాల్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్ గత నెల 27న ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నిందితుడు సదాకత్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఐతే, ఈ కేసుకీ ఇప్పుడు కూల్చేసిన ఇంటి యజమాని ఖలీద్ జాఫర్‌కీ నేరుగా ప్రమేయం లేదు. కానీ, ఇతడు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ ప్రధాన అనుచరుడు కావడంతోనే బుల్డోజర్ యాక్షన్ షురూ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ఉమేశ్ పాల్ హత్య జరిగిన వెంటనే ప్రయాగ్‌రాజ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి హంతకులను గుర్తించారు. తదుపరి చర్యల కోసం ప్రధాన అనుమానితుల జాబితా, ఇతరుల వివరాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే వారందరిపై చర్యలు తీసుకునేందుకు ఆ జాబితాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీకి పంపించారు. నిందితులకు చెందిన అనధికార, అక్రమంగా నిర్మించిన భవనాలు, నివాస ఆస్తుల వివరాలను కూడా పీడీఏ అధికారులు సేకరించారట. యూపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్ దగ్గర్లో నిందితులను గుర్తించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులపై బుల్ డోజర్లను ప్రయోగించేందుకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే పీడీఏకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం ఉన్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్ ఇంటిని యోగి సర్కార్ బుల్డోజర్లు నేలమట్టం చేసే శాయి.
మరోవైపు.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌పై ప్రాణాంతక దాడికి గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు నేతృత్వం వహించాడని గుర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు 50వేల రివార్డు ప్రకటించారు. అతిక్ అహ్మద్ కుమారుడితో పాటు మరో ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయితేఈ క్రమంలోనే పోలీసులు, ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు అతిక్ అహ్మద్, అతని ముఠాకు సన్నిహితంగా ఉన్న మరో 20 మందిని గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లోని తెలియార్ గంజ్, చాకియా, ధుమన్ గంజ్, సాలెంసరాయ్, హర్వారా, జయంతిపూర్, సదియాపూర్, మిండేరా, ఝల్వా, అటాలా ప్రాంతాల్లో నిందితుల ఆస్తులను గుర్తించారు. వారికి సంబంధించిన అక్రమ ఆస్తులను కూలగొట్టే ప్రక్రియనే తాజాగా ప్రారంభించారు. అంటే, యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ఒక్క ఖలీద్ జాఫర్ ఇంటితోనే ఆగదన్న మాట. ఈ కేసుతో లింక్ ఉన్నా లేకపోయినా గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో లింకున్న ప్రతిఒక్కరి అక్రమ నిర్మాణాలూ నేలమట్టం కావడానికి పెద్దగా టైం లేనట్టే కనిపిస్తోంది.
ఇటు బుల్డోజర్లతో గ్యాంగ్‌స్టర్లను వణికించడంతోపాటూ ప్రయాగ్‌రాజ్ మర్డర్ కేసు నిందితులతో అఖిలేష్ యాదవ్ ఫొటోలను షేర్ చేయడం ద్వారా సమాజ్‌వాదీ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ అన్న యోగి మాటలే నిజం అని జనం నమ్మేలా యాక్షన్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. ఇక బుల్డోజర్ల యాక్షన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం యూపీలో గ్యాంగ్‌స్టర్ల ఖేల్ ఖతం అయినట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి.