విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోగా.. తాజాగా స్టీల్ ప్లాంట్ ను కొనుక్కోవాలనుకునే వారి కోసం కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ టెండర్లలో బిడ్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. తన రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వమే ఏ ప్రయత్నమూ చేయని సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి కాలరీస్ సంస్థ నుంచి టెండర్లలో బిడ్ దాఖలు కావటం అందరికీ షాకిచ్చింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనే పరిస్థితుల్లో లేమంటూ క్లారిటీ ఇచ్చింది. అసలు తెలంగాణ నుంచి టెండర్ లో బిడ్ రావటం వెనుక కేసీఆర్ మాస్టర్ స్ట్రేటజీ ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కనుక కేసీఆర్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళకుండా ఆపగలిగి సింగరేణి సొంతం అయితే కనుక అటు ఏపీ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ జరగటం ఖాయం. దీంతో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత మైలేజీ వస్తుంది. బీజేపీకి ఎదురుగాలి కూడా తప్పదు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా గట్టిగానే వాడుకోవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవటం ఎలాగో మిగితా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది.. అలాగే చాలా పార్టీలు బీఆర్ఎస్ తో చేతులు కలపేందుకు రెడీ అవుతాయి. ఇంత పొలిటికల్ మైలేజీ ఉంది కాబట్టే కేసీఆర్ సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు బిడ్ వేయించారని రాజకీయ విశ్లేషకుల భావన.
