బైక్ యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా విరూపాక్ష సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. రొటీన్ యాక్షన్, లవ్ స్టోరీతో కాకుండా ఈ సారి థ్రిల్లర్ కథతో తెరకెక్కిన విరూపాక్ష సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విరూపాక్ష ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వచ్చేలా చేసింది. విడుదలకు ముందు సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేసింది విరూపాక్ష. శుక్రవారం రిలీజైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చేసింది.
ఓ ఊరిలో అనుకోకుండా జరిగిన ఓ భయానక ఘటన.. ఆ ఘటన తర్వాత ఆ గ్రామంలో జరిగే పర్యవసానాలు.. వాటికి కారణాలను వెతుక్కుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళే ఓ యువకుడు.. చిత్ర విచిత్రమైన మరియు భయానక పరిస్థితులు.. ఊహించని ట్విస్టులు.. చివరకు ఆ యువకుడు సమస్యకు పరిష్కారం కనుక్కోవటం.. ఇదీ విరూపాక్ష బేస్ స్టోరీ.
రుద్రవనం అనే ఊరిలో చేతబడి చేస్తున్నారంటూ ఓ జంటను సజీవదహనం చేస్తారు గ్రామస్తులు. చనిపోయే సమయంలో ఆ జంట ఊరిని శపిస్తారు. ఆ శాపం వల్ల ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా ఊరిని అష్టదిగ్బంధనం చేస్తారు గ్రామస్తులు. కానీ తాను ప్రేమించిన అబ్బాయి కోసం ఆ ఊరి అమ్మాయి పొలిమేర దాటడంలో ఊహించని విపత్తు గ్రామానికి ఎదురౌతుంది. తాను ప్రేమించిన అమ్మాయిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడేయటానికి.. ఊర్లో జరుగుతున్న మరణాలకు కారణాలు కనుక్కోటానికి ఆ ఊర్లో అడుగుపెడతాడు హీరో. ఆ క్రమంలో అతడికి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. జీవితంలో ఎప్పుడూ చూడని.. కనీసం ఊహించని భయానక పరిస్థితుల్లో హీరో ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్తాడు. ఈ క్రమంలో కథలోని ట్విస్టులు ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తాయని చెప్పాలి. థ్రిల్లింగ్ స్టోరీ అంటే నిజంగా థ్రిల్ అయ్యేలాగానే కథ రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. ఇక సుకుమార్ స్క్రీన్ ప్లే గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అజనీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కథతో ఎంగేజ్ అయ్యాలా చేసింది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ కథకు తగినట్టు అద్భుతంగా ఉంది. ఇక సంయుక్త, రాజీవ్ కనకాల, అభినమ్ గోమఠం.. ఇలా మిగితా పాత్రలన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి సినిమా నిజమైన థ్రిల్లర్.. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా.