ప్రయాణీకులను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో వందే మెట్రో పేరుతో మరో భారీ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. పెద్ద నగరాలను ఆనుకొని ఉన్న చిన్న చిన్న పట్టణాలను కలుపుతూ వందే మెట్రో హైస్పీడ్ ట్రైన్లను వచ్చే డిసెంబర్ లో పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ వంటి రాజధాని నగరానికి వంద కిలోమీటర్ల దూరంలోని పట్టణాలు, పల్లెల నుంచి ఒకే రోజున అటు, ఇటు ప్రయాణించటం వీలయ్యే విధంగా రోజుకు 4 లేదా 5 ట్రైన్లను నడిపే విధంగా వందే మెట్రో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. మహా నగరాలకు వంద కిలోమీటర్ల లోపు మాత్రమే వందే మెట్రో రైళ్ళు నడిపిస్తామన్నారు.
వందే మెట్రో వల్ల ఉద్యోగులు, విద్యార్థులు సొంతూళ్ళ నుంచి మహానగరాలకు వెళ్ళి రావటం వీలు అవుతుందన్నారు. పని కోసం, చదువు కోసం నగరాలకు వెళ్ళే వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకోవచ్చన్నారు. చదువు, ఉద్యోగం కోసం సొంతూళ్ళను వదిలి ఉండటం సౌకర్యంగా లేని వాళ్ళకు వందే మెట్రో వరంగా మారనుంది. వారానికి 5 రోజులు హైదరాబాద్ లో ఉండి వారాంతంలో శని, ఆదివారాలు ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు వేల మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకు నగరంలో హాస్టల్ లేదా రూమ్ అద్దెకు తీసుకొని ఉండాల్సిన బాధ తప్పుతుంది. వచ్చే డిసెంబర్ లో వందే మెట్రో పట్టాలెక్కిస్తామని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.