దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ ను పోలీసులు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఉమేష్ ను చుట్టు ముట్టిన అతీక్ అహ్మద్ గ్యాంగ్ మనుషులు.. ప్రాణాలు పోయేదాకా ఉమేష్ పాల్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో వారి క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమేష్ పాల్ కు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్ ను కూడా అతీక్ గ్యాంగ్ కాల్చి చంపింది. అతి దగ్గరి నుంచి తుపాకీ తో కాల్చి.. ఉమేష్ కింద పడిపోయాక మరిన్ని రౌండ్లు కాల్పులు జరపటం వీడియోలో కనిపిస్తోంది. ఉమేష్ బాడీగార్డ్ కూడా దగ్గరి నుంచి కాల్చటంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కింద పడిపోయిన తర్వాత కూడా ఇద్దరిపై కాల్పులు జరిపారు దుండగులు. పోలీసులు అనుమానించినట్టే అతీక్ అహ్మద్ తమ్ముడు అసద్ కూడా సంఘటన స్థలంలో ఉన్నాడు.
2005లో అతీక్ అహ్మద్ గ్యాంగ్ రాజు పాల్ ను హత్య చేయగా.. ఆ హత్య కేసులో ఉమేష్ పాల్ కీలక సాక్షి. కేసు రుజువు అయ్యే సమయానికి ఉమేష్ పాల్ ను అతీక్ గ్యాంగ్ హత్య చేయించింది. ఇది ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాల తీవ్రమైన ఆరోపణలకు సమాధానంగా మాఫియాను మట్టిలో కలిపేస్తానని చెప్పిన సీఎం యోగీ.. చెప్పినట్టుగానే ఉమేష్ పాల్ హత్యతో సంబంధం ఉన్న అందరినీ పోలీసులు ఎన్ కౌంటర్లో చంపేశారు. అతీక్ గ్యాంగ్ లోని అర్బాజ్ ఫిబ్రవరి 27న ఎన్ కౌంటర్ లో చనిపోగా, ఆ తర్వాత అతీక్ తమ్ముడు అసద్, గులాం, అర్బాజ్, ఉస్మాన్ లను కూడా పోలీసులు హతమార్చారు. చివరికి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ పోలీసుల కళ్ళ ముందే ప్రత్యర్థుల కాల్పుల్లో హతం కావటంతో ఈ మాఫియా సర్కిల్ ఇక్కడితో ముగిసిపోయింది. మొత్తం ఎన్ కౌంటర్లకు కారణమైన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఎట్టకేలకు పోలీసులు సాక్ష్యంగా పేర్కొంటూ విడుదల చేయగా.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.