తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి నాయక్ కేసులో మరో భారీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి శరీరంలో అసలు రసాయలనాల ఆనవాళ్ళే లేవంటూ టాక్సికాలజీ రిపోర్టు వచ్చింది. సీనియర్ సైఫ్ వేధింపులతో తీవ్రం అవమానానికి గురైన ప్రీతి నాయక్.. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిందంటూ ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్లు, పోలీసులు చెప్పారు. విషం ప్రభావంతోనే కిడ్నీలు, లివర్ పని చేయలేదని కూడా చెప్పారు. చివరికి ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. కానీ టాక్సికాలజీ రిపోర్టులో మాత్రం ప్రీతి శరీరంలో అసలు ఏ రకమైన రసాయనాలు లేవంటూ రావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రీతిని హైదరాబాద్ లోని నిమ్స్ లో అడ్మిట్ చేయటానికి ముందు నుంచే ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నట్టు వైద్యులు, పోలీసులు చెప్పారు. ప్రీతికి వైద్యం అందుతున్నన్ని రోజులు ఇదే చెప్పిన వైద్యులు.. చివరికి ఆమె శరీరంలో రసాయనాల ఆనవాళ్ళు లేవంటూ రిపోర్టులో పేర్కొనటం కేసులో అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. అసలు ప్రీతి ఆత్మహత్యకు ముందు కాలేజ్ లో ఏం జరిగింది.. ఆమెను ఎవరు వేధించారు.. సైఫ్ చేసిందేమిటి.. ప్రీతి పోస్ట్ మార్టంలో ఏముంది.. ఇలా అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టాయి.