టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన మారణహోమంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికే రెండు దేశాల్లో కలిపి దాదాపు 16 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం టర్కీలో మృతుల సంఖ్య 12,873 కాగా, సిరియాలో 3,162 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకొని ఉన్నారు. వారిలో 90 శాతం మంది ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని అధికారులు చెప్తున్నారు. సోమవారం తెల్లవారు జామున 7.8 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించిన తర్వాత 72 గంటల్లో 5 సార్లు దాదాపు 7.5 తీవ్రతకు తగ్గకుండా భూకంపాలు సంభవించాయి. దీంతో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
వరుస భూకంపాలతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే అవకాశం కూడా లేకుండాపోవటంతో చిక్కుకున్న వాళ్ళు అక్కడే మృత్యువాత పడ్డారు. తన కళ్ళ ముందే తన 15 సంవత్సరాల కుమార్తె శిథిలాల కింద ఇరుక్కొని విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోవటంతో చనిపోయిన కుమార్తె చేయి పట్టుకొని విలపిస్తున్న ఆ తండ్రిని చూసి చూపరులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. టర్కీ, సిరియా సరిహద్దుల్లో ఎక్కడ చూసినా ఇటువంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా దేశాల నుంచి సాయం అందించేందుకు ఆయా దేశాల ఆర్మీ రంగంలోకి దిగింది. సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఏర్పడుతున్న ప్రకంపనలు రెస్క్యూ సిబ్బందిని కూడా భయపెడుతున్నాయి. టర్కీ, సిరియా చరిత్రలో గత వందేళ్ళలో ఇంతటి విపత్తు ఎప్పుడూ సంభవించలేదని.. తాము కనీ వినీ ఎరుగని విపత్తు ఎదుర్కోవాల్సి వచ్చిందనీ.. ప్రపంచం తమకు అండగా నిలబడాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు సాయం అర్థిస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ దోస్త్ పేరిట భారత ప్రభుత్వం టర్కీకి అండగా నిలిచింది.