ఉక్రెయిన్ లోని నోవా కఖోవ్కా డ్యామ్ నిన్న బాంబు దాడులతో కూలిపోయిన విషయం తెలిసిందే. డ్యామ్ గేట్లు పూర్తిగా బద్దలైపోవటంతో దిగువ ప్రాంతాల్లోకి భారీగా వచ్చిన వరద.. ఖేర్సన్ నగరాన్ని ముంచేసింది. దీంతో అక్కడ నివసిస్తున్న సుమారు 42 వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. బుధవారం మధ్యాహ్నానికి ఖేర్సన్ నగరం పూర్తిగా నీటిలో మునిగిపోయిందనీ.. మరి కొద్ది గంటల్లో ఖేర్సన్ నగరం నాలుగు అడుగుల లోతనకు వెళ్ళిపోబోతోందనీ ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. తమను అప్రతిష్ట పాలు చేసేందుకు అధ్యక్షుడు జెలెన్ స్కీ చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నాడనీ.. కావాలనే కఖోవ్కా డ్యామ్ ను ఉక్రెయిన్ సైన్యం చేత ధ్వంసం చేయించి ఆ పాపం రష్యాకు అంటించాలని జెలెన్ స్కీ వ్యూహం పన్నాడనీ ఆరోపించింది. డ్యామ్ ధ్వంసం వల్ల రకరకాల ప్రకృతి అసమానతలు యేళ్ళ పాటు ఖేర్సన్ నగరాన్ని పీడించబోతున్నాయని రష్యా చెప్తోంది.
30 మీటర్ల ఎత్తు, 3 కిలోమీటర్ల పొడవైన నోవా కఖోవ్కా డ్యామ్ నిర్మాణం సోవియట్ కాలంలోనే జరిగింది. సుమారు 140 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి త్రాగునీటిని అందించే ఈ డ్యామ్ ను నీపర్ నదిపై నిర్మించారు. ఉక్రెయిన్ లోని ఖేర్సన్ తో పాటు మరి కొన్ని ప్రాంతాలకూ అలాగే రష్యాలోని కొంత ప్రాంతానికి కూడా ఈ డ్యామ్ నుంచి నీరు సరఫరా అవుతుంది. జపోరిజియా నగరంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పవర్ జనరేటర్ల కూలింగ్ కోసం కూడా ఈ నీటినే వినియోగిస్తారు. ఇంత ప్రాముఖ్యత గల డ్యామ్ కూలిపోవటంతో ఖేర్సన్ తో పాటు చాలా ప్రాంతాలకు త్రాగునీరు కష్టాలు మొదలైనట్టే. అలాగే ఈ డ్యామ్ నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేసే హైడ్రో పవర్ ప్లాంట్ కు కూడా నీటి సరఫరా నిలిచిపోవటంతో ఉక్రెయిన్ కు విద్యుత్ కష్టాలు రెట్టింపు అయినట్టే.
