ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికతో తెలంగాణ కాంగ్రెస్ మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ శత విధాలా ప్రయత్నించినా వీరిద్దరూ కమలం పార్టీలోకి వెళ్ళేందుకు ఆసక్తి కనపరచలేదు. చివరికి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు కావటంతో వీళ్ళ చేరికతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకున్నదని చెప్పటంలో సందేహం లేదు. పార్టీ క్యాడర్ కాకుండా కాస్త సొంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కాబట్టి ఖమ్మం రాజకీయాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి. ఈ పరిణామంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాప్పీగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీనియర్లు కాస్త సైలెంట్ కావటం.. ఖమ్మం నేతలు కాంగ్రెస్ లో చేరటం.. ఖమ్మం నేతల చేరిక వెనుక రేవంత్ పడిన కష్టాన్ని రాహుల్ గాందీ అభినందించటం తదితర పరిణామాలతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆమాత్రం సంతోషంగా ఉండటంలో విశేషమేం లేదు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో గాంధీ భవన్ బిజీ బిజీగా మారింది. టిక్కెట్ పైరవీలతో జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. అటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ చేయటంతో టీ కాంగ్రెస్ లో జోష్ మరింత పెరిగింది. ఎలాగైనా సరే బీజేపీని ఎదగకుండా చేయాలంటే ఏం చేయాలో వ్యూహ రచన చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు కూడా గాంధీ భవన్ లోనే తిష్ట వేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అధికార పార్టీలోని అసంతృప్తులను ఎలా కాంగ్రెస్ లోకి లాగాలి అనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్టానం కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంది. సుమారు 25 మంది సిట్టింగులకు ఈ సారి కేసీఆర్ టిక్కెట్లు ఇవ్వబోరని జోరుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ 25 మందిని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారట. మొత్తానికి.. నిన్న మొన్నటి దాకా ఉసూరుమన్నట్టుగా ఉన్న గాంధీ భవన్ ఇప్పుడు బిజీగా మారిందన్నమాట.