2023-24 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావటంతో ఈ బడ్జెట్ అధికార పార్టీకి ఎంతో కీలకంగా మారింది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచేందుకు కేసీఆర్ క్యాబినెట్ తీవ్ర కసరత్తే చేసినట్టు కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2,90,396 కోట్ల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. అంటే సుమారు 3 లక్షల కోట్ల లెక్క. ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.
మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లు, తలసరి ఆదాయం అంచనా రూ.3,17,115, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు,
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6,385 కోట్లు, రైతు బంధు కోసం రూ.15,075 కోట్లు, ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.3,560 కోట్లు, హోంశాఖకు రూ.9,599 కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ.12,000 కోట్ల కేటాయింపులు జరిగాయి. సంక్షేమ పథకాలకే భారీ కేటాయింపులు జరపాల్సి వచ్చింది. రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు పథకాలకే సుమారు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. 26,885 కోట్లతో నీటి పారుదల రంగానికి కేటాయించి సాగునీటికి పెద్దపీట వేసి తన ప్రభుత్వం మొదటి లక్ష్యం నీరేనని ప్రభుత్వం మరోసారి చెప్పింది.