HomeNATIONAL NEWSతమిళ రాజకీయాలను షేక్ చేస్తున్న మాజీ ఐపిఎస్

తమిళ రాజకీయాలను షేక్ చేస్తున్న మాజీ ఐపిఎస్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నంత వరకు తమిళనాట డీఎంకే సర్కార్‌కు తిరుగులేదనుకున్నారు. వచ్చే పదేళ్ల పాటూ అధికారం చేతులు మారే పరిస్థితే రాదనుకున్నారు. దీనికి కారణం రెండాకుల పార్టీ విడాకులు, జాతీయ పార్టీలకు సీన్ లేకపోవడమే. కానీ, అదంతా గతం. ఇప్పుడు తమిళనాడులో ఏమో గుర్రం ఎగరావచ్చనే నానుడి కాస్త గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామి. ఐపీఎస్‌గా రియల్ సింగం అని పించుకున్న ఈ యంగ్ పొలిటీషియన్ ఇప్పుడు స్టాలిన్ సర్కార్‌ను తరుముకొస్తున్నారు. ఎంతగా అంటే ఆ రాష్ట్రంలో కమల వికాసం అసాధ్యం అనే స్థాయి నుంచి డీఎంకే ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతోందా అని అనుమానించే స్థాయికి పరిస్థితుల్లో మార్పొచ్చింది. దీనంతటికీ కారణం తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామినే. ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే తమిళనాట కమల వికాసం క్రమంగ మొదలైంది. ఇప్పుడది నెక్స్ట్ లెవెల్‌కు చేరుకునేలా డీఎంకే సర్కార్‌పై అన్నామలై యుద్ధం ప్రకటించేశారు.
అన్నామలై రాజకీయం రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తోంది. తమిళనాట రెగ్యులర్ పొలిటీషియన్స్‌ మాదిరిగా పెరియార్ సిద్ధాంతాలు వల్లించకుండా అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ అవినీతి ఇదే అంటూ డీఎంకే ఫైల్స్‌ ఎపిసోడ్‌కు తెరలేపారు. ఏ ప్రజా ప్రతినిధి ఎంత మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డారో లెక్కలతో సహా వివరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా తమిళనాడు చరిత్రలోనే ఈ స్థాయి సాహసానికి ఏ పార్టీ పూనుకుని ఉండకపోవచ్చు.
కరుణానిధి, జయలలిత హయాంలోనూ ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు కనిపించినా ఈ స్థాయిలో ఎదురు దాడి గతమెన్నడూ కనిపించని రాజకీయ చిత్రమే అంటున్నారు తమిళ తంబీలు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే..డీఎంకే ఫైల్స్‌పై విడుదల తర్వాత అన్నామలై స్టాలిన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఒక కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినందుకు 200 కోట్లు లంచంగా ఇచ్చినట్లు ఆరోపించారు. విదేశాల్లోని షెల్‌ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పోన్‌ముడి, వీ సెంథిల్ బాలాజీ, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ జగత్రక్షకన్‌తో సహా డీఎంకే కీలక నేతలకు చెందిన 1.34 లక్షల కోట్ల విలువైన ఆస్తుల జాబితాను బహిరంగపరిచారు.
డీఎంకే అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల్లో స్టాలిన్ చేసిన మార్పులన్నీ తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం చేసినవే అని అన్నామలై ఆరోపిస్తున్నారు. నీట్ ఆందోళనల దగ్గర నుంచి మొన్నటి శ్రీరామనవమి శోభాయాత్ర వరకూ ప్రతి విషయంలోనూ స్టాలిన్ సర్కార్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెరియార్ సిద్ధాంతాల పేరుతో తమిళ హిందువులను ఇబ్బంది పెడుతుందని కూడా ఆ రాష్ట్ర బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇటీవల పెరుగు ప్యాకెట్‌పై దహి అనే పేరుమీద వివాదం కూడా వాంటెడ్‌గా తెరపైకి తెచ్చినవేనని ఆరోపిస్తోంది. స్టాలిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతకవలను డైవర్ట్ చేసేందుకే డీఎంకే ప్రభుత్వం వివాదాలను తెరపైకి తెస్తుందని అన్నామలై సైతం ఆరోపిస్తూ వచ్చారు. అందుకే స్టాలిన్ సర్కార్‌ అవినీతిని బయటపెట్టాలనే లక్ష్యంతో డీఎంకే ఫైల్స్‌పై ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా అన్నామలై రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్ ట్రెండింగ్‌లోకొచ్చింది. ఈ ఫైల్స్‌లో మొదట టార్గెట్ చేసింది స్టాలిన్ సోదరి కనిమొళినే. తమిళనాడు ఎన్నికల సమయంలో స్టాలిన్ సోదరి తన ఆస్తులను 30 కోట్లుగా ఈసీకి నివేదించారు. కానీ, ఆమెకు కలయింగర్ టీవీలో ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలున్నాయని అన్నామలై తాజా డీఎంకే ఫైల్స్‌లో ఆరోపించారు. కేవలం ఏళ్ల వ్యవధి లోనే ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రధాన ప్రశ్న. ఇక జగత్ రక్షకన్ అనే మంత్రి తనఎన్నికల అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చూపించారనీ.. ఇప్పుడు ఆయన సంపాదన ఏకంగా వందల కోట్లకు వెళ్ళిపోయిందని ఆరోపించారు. ఇది ఎలా సాధ్యమవుతుందో చెబితే తమిళ ప్రజలు మొత్తం అనుసరిస్తారంటూ అన్నామలై అడుగుతున్నారు.
ఇవి వేలు అనే మంత్రి ఎన్నికలప్పుడు తన అరుణయి అనే కాలేజీ విలువ వెయ్యి 86 కోట్లు ఉంటుందని అఫిడవిట్‌లో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన కాలేజీ విలువ నాలుగు వేల కోట్లకు పెరిగిందని వీడియోలో చూపించారు. ఆయన కాంబన్ కాలేజీ విలువ కూడా 141 కోట్లకు పెరిగింది. ఇక మరో మంత్రి కేఎన్ నెహ్రూ కూడా తన సంపాదన వేల కోట్లకు పెంచుకున్నారు. ఇలా 27 డిఎంకే నాయకులు తమ ఆస్తులను అడ్డగోలుగా పెంచుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నారు. వీరి అవినీతి విలువ రెండు లక్షల కోట్లు అని లెక్కలతో సహా చూపిస్తున్నారు. అంతేకాదు ఇది తమిళనాడు జీడీపీలో పది శాతం అని, స్వచ్ఛమైన పాలన అందిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన స్టాలిన్ ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే తాజాగా విడుదల చేసిన డీఎంకే ఫైల్స్ జస్ట్ ట్రయిలర్ మాత్రమేననీ, అసలైన సినిమా ఏడాదిపొడవునా భాగాలు భాగాలుగా రిలీజ్ అవుతూనే ఉంటుందని ప్రకటించి మరో షాక్ కూడా ఇచ్చారు.
డీఎంకే ఫైల్స్‌పై అన్నామలై వర్షన్ ఇలా ఉంటే.. అధికార పార్టీ మాత్రం అన్నామలై కుప్పుస్వామి రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్‌ నాన్సెన్స్ అంటూ కొట్టిపారేస్తోంది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి ఈ ఆరోపణలను జోక్‌ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారని తెలిపారు. వాటిలో ఏ ఒక్కటి తప్పుగా అనిపించినా వారి ఎన్నికను ప్రజలు సవాల్‌ చేయవచ్చని అన్నారు. ఏళ్ల కిందట 87 కోట్లతో నిర్మించిన ఎల్‌ఐసీ భవనం విలువ ఇప్పుడు వేలాది కోట్లు ఉంటుందన్నారు. అన్నామలై ఆరోపించిన లెక్కలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఈ ఆరోపణలపై తమ నేతలంతా కోర్టుకు వెళితే ఆయన రోజూ కోర్టు చుట్టూ తిరుగాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటివరకూ తమిళనాట రాజకీయం డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగానే ఉండేది. కానీ, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఎప్పుడైతే అన్నామలై బాధ్యతలు చేపట్టారో కమలం పార్టీ అనూహ్యంగా బలం పుంజుకోవడం మొదలైంది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కర్ణాటకలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. 2015లో 17 ఏళ్ల విద్యార్ధిని రేప్, మర్డర్ కేసు విచారణతో అన్నామలై పేరు మార్మోగిపోయింది. 2017 చిక్కమంగళూరు అల్లర్ల అణచివేత.. అల్లర్లకు కారకులపై ఉక్కుపాదం మోపడం లాంటి పరిణామాలతో కన్నడిగులందరితో రియల్ సింగం అనిపించుకున్నారు. ఆ తర్వాత ఉడిపి ఎస్పీగా ఉన్న సమయంలో ఖురాన్‌ చదివి ఇస్లాంను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉడాది తిరక్కుండానే బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. స్వతహాగా ఐపీఎస్ కావడంతో డీఎంకే ప్రభుత్వంపై అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
మొత్తంగా.. తమిళనాడు బీజేపీ చీఫ్ రిలీజ్ చేసిన డీఎంకే ఫైల్స్‌ ఎపిసోడ్‌ భవిష్యత్‌లో మరిన్ని ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా అన్నామలై యాక్షన్‌తో తమిళనాట డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉండే పొలిటికల్ హీట్ కాస్తా స్టాలిన్ వర్సెస్ అన్నామలైగా మారినట్టే కనిపిస్తోంది. బీజేపీ చీఫ్ ఇదే దూకుడు కొనసాగిస్తే తమిళనాడులో కమలం పార్టీ అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయంగా మారడం పెద్ద కష్టమేం కాదనే చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్‌లో అన్నామలై యాక్షన్ ఆ దిశగ ఉంటుందేమో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...