సినిమా ఇండస్ట్రీపై తరచూ ఏవో విమర్శలు చేసే యాక్ట్రెస్ట్ తాప్సీ.. మరోసారి బాలీవుడ్ పై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. బాలీవుడ్ లో క్యాంపు రాజకీయాలు, ఫేవరెటిజం అనేవి ఎప్పటికీ పోవనీ.. బాలీవుడ్ స్టార్లంతా తమకు ఇష్టమైన వాళ్ళను, తమకు కావాల్సిన వాళ్ళనే తమ సినిమాల్లోకి తీసుకోవాలని భావిస్తారనీ.. బయటి వాళ్ళు ఎదగటం కష్టమనీ కామెంట్ చేసింది. బాలీవుడ్ లో ఎదగాలంటే ఇవన్నీ తట్టుకొని అవకాశాలు సాధిస్తే మాత్రమే సాధ్యమవుతుందంటూ వ్యాఖ్యానించింది. బాలీవుడ్ లో ఈ దరిద్రం ఎప్పటికీ పోనే పోదంటూ చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం ప్రియాంకా చోప్రా ఇదే విధంగా మాట్లాడింది. బాలీవుడ్ లో కొంత మంది తనపై కక్ష కట్టి తనకు అవకాశాలు రాకుండా చేశారనీ.. దీని వల్లనే తాను బాలీవుడ్ వదిలి హాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కున్నాననీ ప్రియాంకా చోప్రా వ్యాఖ్యానించింది. దీనిపైనే స్పందించిన తాప్సీ.. బాలీవుడ్ లో క్యాంపులు, ఫేవరెటిజం తప్పవంటూ రియాక్ట్ అయ్యింది. కాకపోతే.. ఇలా చేసే వాళ్ళను తప్పు పట్టలేమనీ.. అది వాళ్ళ కెరీర్ కోసం ముఖ్యమైనదంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
గతంలో కూడా బాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది తాప్సీ. బాలీవుడ్ లో నెపోటిజం విపరీతంగా ఉందనీ.. దానితో పాటు లైంగిక వేధింపులు కూడా తట్టుకుంటేనే బాలీవుడ్ లో స్టార్ అవుతారంటూ వ్యాఖ్యానించింది. అంతకు ముందు తెలుగు సినీ పరిశ్రమపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తెలుగు డైరెక్టర్లకు హీరోయిన్లపై ఉండే అభిప్రాయమే వేరుగా ఉంటుందంటూ కామెంట్లు చేసింది. “డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి.. నా బొడ్డుపై కొబ్బరికాయ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. అసలు ఆ కాన్సెప్ట్ ఏమిటో వాళ్ళకే తెలియాలి..” అంటూ టాలీవుడ్ డైరెక్టర్లను విమర్శించింది తాప్సీ. ఇప్పుడు బాలీవుడ్ పై తాప్సీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.