శివసేన పార్టీ గుర్తును, ఆ పార్టీ పేరును రెండింటినీ ఏక్ నాథ్ షిండే వర్గానికే సొంతం అంటూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసలైన శివసేన షిండే వర్గానిదేనంటూ ఎన్నికల సంఘం నిర్ణయించగా.. దీనిపై భగ్గుమన్న ఉద్ధవ్ థాక్రే సుప్రీం కోర్టుకు వెళ్ళారు. అంత అర్జెంటుగా షిండే వర్గానికి శివసేన పార్టీ పేరును, గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించిన థాక్రే.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించటానికి నిరాకరించింది. దీంతో థాక్రే వర్గానికి చుక్కెదురైంది.
తన తండ్రి అయిన దివంగత బాలా సాహెబ్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీని ఇతరుల పార్టీగా నిర్ణయించటం పట్ల థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా ముఖ్యమంత్రి పదవితో పాటు శివసేన పార్టీని, గుర్తును కూడా ఏక్ నాథ్ షిండే లాగేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక తన ఇంటి పేరును కూడా షిండే లాగేసుకుంటారా అంటూ థాక్రే ప్రశ్నించాడు. కొద్ది నెలల క్రితం ఏక్ నాథ్ షిండే తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ వద్ద తన అనుచర ఎమ్మెల్యేలతో బల నిరూపణ చేసుకొని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందుకు బీజేపీ మద్దతిచ్చింది. శివసేన పార్టీ పేరు, గుర్తు రెండూ తమ వర్గానికే చెందుతాయంటూ షిండే, థాక్రే వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.