లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. మనీష్ సిసోదియా ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టులో లేదంటే స్పెషల్ కోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న మనీషి సిసోదియాను ఆదివారం ఉదయం నుంచి సుమారు 8 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు సాయంత్రం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ మనీష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ విచారణను తిరస్కరించటంతో మనీష్ సిసోదియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి హోదాలో జైళ్ళో శిక్ష అనుభవించటం తగదని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. మనీష్ చేత రాజీనామా చేయించాడు. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ తయారు చేయటంలో భాగంగా భారీ కుంభకోణానికి ఢిల్లీ ముఖ్యమంత్రి సహా ఆప్ మంత్రులు పాల్పడ్డారంటూ సీబీఐ ఆరోపణలు చేసింది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని జైళ్ళో వేయించింది.