సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో కోడిపందేలకు సిద్ధమవుతారు పందెం రాయుళ్ళు. కొన్ని నెలల ముందే సంక్రాంతి కోడి పందేలకు రెడీ అవుతుంటారు. యేడాది పొడవునా బాగా మేపి.. మంచి దిట్టమైన పందెం కోడిని సిద్ధం చేసుకొని.. సంక్రాంతి సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పోలీసులు, ప్రభుత్వాలు కోడి పందేలు నిషేధించామని చెప్తుంటారే కానీ.. జనం సెంటిమెంటును కాదని వాళ్ళు పెద్దగా ఏమీ చేయరు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏపీ మొత్తం పందెం కోళ్ళ కూతలతో మార్మోగిపోతోంది. కోడి పందేలు యేటా జరిగేవే కానీ.. ఈసారి మాత్రం చిత్రవిచిత్రమైన సన్నివేశాలు.. కొత్త కొత్త ఆఫర్లు కనిపిస్తున్నాయి ఏపీ గ్రామాల్లో.
ఇక్కడ డబ్బులు అమ్మబడును అంటూ కొత్త బోర్డులు కనిపిస్తున్నాయి కోడి పందేలు జరిగే స్థలాల్లో. అంటే.. క్రెడిట్, డెబిట్ కార్డులు స్వైప్ చేస్తే చాలు మనకు కావాల్సిన డబ్బును వాళ్ళు అక్కడికక్కడే అరేంజ్ చేస్తారన్నమాట. కాకపోతే కమిషన్ చెల్లించాల్సి ఉంది. ఫోన్ పే, గూగుల్ పే లాంటివి కూడా స్కానర్లతో సహా అందుబాటులో ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా స్టాల్స్ ఓపెన్ చేసి వడ్డీ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. పర్సనల్ లోన్ కావాలన్నా సరే అప్పటికప్పుడు చిన్న చిన్న మొత్తాలను ఇచ్చేస్తున్నారు. మొత్తానికి పందెం రాయుళ్ళ కోసం వడ్డీ వ్యాపారులు టెక్నాలజీని భారీగానే ఉపయోగించి.. పందేలకు సౌకర్యాలను కల్పిస్తున్నారన్నమాట.