తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీగా పని చేసిన సోమేష్ కుమార్.. కేంద్రం ఆదేశాలతో తన సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఏపీలో రిపోర్ట్ చేసి చాలా రోజులు గడిచినా ఏపీ ప్రభుత్వం ఆయనకు ఏ బాధ్యతా అప్పజెప్పకుండా అలా ఖాళీగానే ఉంచేసింది. దీంతో సోమేష్ కుమార్ రిటైర్ అయిపోవాలని నిర్ణయించుకుని.. వీఆర్ఎస్ కు అప్లై చేయటం.. అందుకు ప్రభుత్వం అంగీకరించటం కూడా జరిగిపోయాయి. త్వరలోనే సోమేష్ కుమార్ తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారన్నమాట. అయితే.. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
సోమేష్ కుమార్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉంది. ఇద్దరి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉండేవి. కానీ అనుకోకుండా సోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ పదవిని వదిలి.. ఏపీ వెళ్ళి.. చివరికి రిటైర్ కావాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో సోమేష్ కుమార్ కు ఢిల్లీలో కేసీఆర్ తన పార్టీలో కీలక పదవిని కట్టబెట్టనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి కేసీఆర్ చేయబోయే కొత్త రాజకీయాల్లో సోమేష్ కుమార్ ను తన ప్రధాన సలహాదారుగానూ.. పార్టీ ప్రధాన సలహాదారుగానూ నియమిస్తారనే వార్త గట్టిగానే వినిపిస్తోంది. సోమేష్ కుమార్ తెలివైన ఐఏఎస్ అధికారి మరియు ఎంతో అనుభవం కలిగిన వాడే కాకుండా.. తెలంగాణ రాజకీయాలను యేళ్ళ తరబడి ప్రత్యక్షంగా చూసిన వాడు. కాబట్టి సోమేష్ తెలివిని, అనుభవాన్ని ఉపయోగించుకోవాలనేది కేసీఆర్ ఆకాంక్ష అనీ.. త్వరలోనే బీఆర్ఎస్ లో సోమేష్ కుమార్ కు కీలక పదవి ఖాయమనీ వార్తలు వినిపిస్తున్నాయి.