నిన్న హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నల్లగుట్ట దక్కన్ స్టోర్స్ అగ్నిప్రమాదం కేసులో రెస్క్యూ టీమ్ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఫస్ట్ ఫ్లోర్ లో ఓ వ్యక్తి అస్తిపంజరాన్ని గుర్తించామని చెప్పారు. అయితే.. అది ఎవరిది అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియదని.. ఫోరెన్సిక్ బృందం అదే పనిలో ఉన్నారనీ చెప్పారు. అగ్ని ప్రమాదం జరగటానికి కొద్ది సేపటి ముందే ముగ్గురు వ్యక్తులు స్టోర్స్ లోకి వెళ్ళారనీ.. వాళ్ళు మళ్ళీ కనిపించలేదనీ స్థానికులు, అక్కడున్న వాళ్ళు నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారని పోలీసులు స్పష్టం చేయగా.. అందులో ఓ వ్యక్తి అస్తిపంజరాన్ని ఈరోజు గుర్తించారు. మిగితా వాళ్ళ ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది.
ఉదయం 10 గంటల ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు 9 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయే తప్ప ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. రాత్రి సమయానికి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది మరియు రెస్క్యూ టీమ్ ఈ రోజు ఉదయం నుంచి డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంటల వేడి ధాటికి బిల్గింగ్ పిల్లర్లలోని ఇనుప ఊచలు కూడా కరిగిపోయాయని రెస్క్యూ టీమ్ చెప్తోంది. ఐరన్ రాడ్లే కరిగిపోయిన నేపథ్యంలో.. సజీవ దహనం అయిన వ్యక్తుల అస్తిపంజరాలు, అవశేషాలు దొరకటం కూడా అనుమానమేనని స్థానికులు చెప్తున్నారు.