కొత్త సంవత్సరం సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల రోజుల నుంచి సినీ ప్రముఖుల మరణ వార్తలు వింటున్న తెలుగు వారికి నేడు మరో విషాద వార్త. అలనాటి అద్భుత గాయని వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. చెన్నై లోని తన ఇంట్లో ఆమె ఈ రోజు ఉదయం మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 78 యేళ్ళ వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. కుటుంబంలో 5వ సంతానంగా జన్మించిన వాణీ అసలు పేరు కలైవాణి. అతి చిన్న వయసులోనే కచేరీ నిర్వహించి అలనాటి సంగీత విధ్వాంసులచే ఔరా అనిపించుకున్నారు వాణీ జయరాం. పూర్తిగా చెన్నైలోనే చదువుకున్న ఈమె అన్ని దక్షిణ భారత భాషలను అద్భుతంగా మాట్లాడగలదు.
ప్లేబ్యాక్ సింగర్ గా వాణీ జయరాం ఓ తరాన్ని ఏలిన అతికొద్ది మందిలో ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీ వంటి ఉత్తర భారత భాషల్లో కూడా పాటలు పాడిన వాణీ జయరాం.. మొత్తం 14 భాషల్లో సుమారు 20 వేలకు పైగా పాటలు పాడారు. 80 వ దశకం మరియు 90వ దశకాలలో ఈమె పాడిన పాటలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ వాణీ పాడిన పాటలు అలనాటి ఆణిముత్యాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి వాణఈ జయరాం పాడిన పాటలు ఇప్పటికీ అజరామరాలే. సీతాకోకచిలుక సినిమాలోని మాటే మంత్రము పాట వందేళ్ళైనా చెరగని అనుభూతినిచ్చే పాటగా ఆమె అభిమానులు చెప్పుకుంటారు. తన తేనె గొంతుకతో కోట్లాది మందిని అలరించిన వాణీ జయరాం మరణం.. సౌత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి.