టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజిపై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన షర్మిళను నిన్న హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. షర్మిళను అరెస్టు చేసే సమయంలో ఆమె మహిళా పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ఎస్సైపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు తమపై చేయి చేసుకున్నందుకు షర్మిళపై కేసు నమోదు చేసి చంచల్ గూడా జైలుకు తరలించగా.. ఆమెుక 14 రోజుల రిమాండ్ విధించబడింది. ఆ తర్వాత షర్మిళ తరఫు న్యాయవాది వేసిన బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన షర్మిళ.. తాను పోలీసులపై చేయి చేసుకోటానికి సంబంధించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఏ మాత్రం శాంతి భద్రతలకు సమస్య రాకుండానే తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ షర్మిళ ప్రశ్నించారు. హౌజ్ అరెస్టు పేరుతో నిర్బంధించే ప్రయత్నం చేశారనీ.. ఎదురు తిరిగితే తనపై దాడి ప్రయత్నం కూడా చేశారనీ షర్మిళ క్లారిటీ ఇచ్చారు. ఒక పోలీసు అధికారి తన చేయి పట్టుకొని లాగి తన చేయి విరిచేందుకు ప్రయత్నించాడంటూ షర్మిళ సంచలన ఆరోపణ చేశారు. తాను పోలీసులను నెట్టి వేస్తున్న వీడియోలు పోలీసులే బయటపెట్టారని.. కానీ తనపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలను మాత్రం దాచేశారనీ షర్మిళ ఆరోపించారు. “మగ పోలీసులు పైపైకి వస్తుంటే ఏం చేయాలి.. నేను నా ఆత్మ రక్షణ కోసం నెట్టివేశాను.. లేకపోతే నా చేయి విరిగేది..” అంటూ చెప్పుకొచ్చారు షర్మిళ. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.