హీరో.. విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏ తేడా లేకుండా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసే విజయ్ సేతుపతి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం షాహిద్ కపూర్ ఫార్జీ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫర్జీ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో షాహిద్ కపూర్ తో పాటు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షాహిద్ కపూర్.. విజయ్ ను పొగడ్తలతో ముంచేశాడు. విజయ్ సేతుపతి నటన తనకు ఎంతో ఇష్టమనీ.. విజయ్ ను మక్కల్ సెల్వన్ అని పిలిస్తే అచ్చుగుద్దినట్టు సరిపోతుందనీ షాహిద్ అన్నాడు.
విజయ్ సేతుపతి నటన.. ఆయన వ్యక్తిత్వం తనకు చాలా నచ్చాయన్న షాహిద్ కపూర్.. ఫర్జీ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారని హింట్ ఇచ్చాడు. తనతో పనిచేయటం చాలా సంతోషంగా ఉందనీ.. భవిష్యత్తులో విజయ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉందని చెప్పాడు. రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫర్జీ సిరీస్.. ఫిబ్రవరి 10 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
