బాలీవుడ్ ఖాన్ల త్రయం అమీర్, షారూఖ్, సల్మాన్ ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో.. అదృష్టం కొద్దీ షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బ్యాడ్ లక్ నుంచి బయటపడ్డాడు. కానీ మిగతా ఇద్దరు ఖాన్ లు మాత్రం ఇంకా ఇంకా దురదృష్టం అనే చెరువులో ఈత కొడుతూనే ఉన్నారు పాపం. లాల్ సింగ్ చడ్డా అంటూ పనికిరాని కథతో ప్రేక్షకుల చీత్కారాలను మూటగట్టుకున్నాడు అమీర్ ఖాన్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు వచ్చింది. 2014లో తమిళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన అజిత్ సినిమా వీరమ్ ను హిందీలో రీమేక్ చేసి చాలా చెత్త ప్రయోగం చేశాడు సల్లూ భాయ్. తొమ్మిదేళ్ళ క్రితం వచ్చిన వీరమ్.. ఆ తర్వాత తెలుగులో డబ్బిండ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యింది. ఇంత జరిగిన తర్వాత కాటమరాయుడు అంటూ యూట్యూబ్ లో ఉన్న సినిమాను రీమేక్ చేసి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఇన్ని ప్రయోగాల తర్వాత మళ్ళీ ఇదే పాత కథను హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ కు ఎందుకు అనిపించిందో తెలియదు గానీ.. భారీ బడ్జెట్ తో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పేరుతో ప్రేక్షకులను పలకరించాడు. వచ్చీ రావటంతోనే సినిమా అంతెత్తు ఎగిరి మరీ బావిలో దూకినట్టైంది పాపం. రెండు భాషల్లో యూట్యూబ్ లో ఉన్న సినిమాను రీమేక్ చేయటం నిజంగా ఆత్మహత్యతో సమానం అని సల్లూకు ఇప్పటికి అర్థమైంది. బాలీవుడ్ ప్రేక్షకులు వీరమ్, కాటమరాయుడు సినిమాలు చూడలేదు కదా ఏం ఫరవాలేదు అనుకున్న సల్మాన్ కు.. సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ తెలియలేదు.. బాలీవుడ్ ప్రేక్షకులు వీరమ్ ను ఎప్పుడో చూసేశారని. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 10 కోట్లు వసూలు చేయలేక బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. అప్పుడెప్పుడో 1973 లో వచ్చిన అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ సినిమా జంజీర్ ను రీమేక్ చేస్తేనే జనం చూడలేదు.. మరి అలాంటిది యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతున్న తమిళ, తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేస్తే చూస్తారనుకోవటం నిజంగా నిర్మాతల బుద్ధితక్కువ తనమే. ఎంత సల్మాన్ ఖాన్ అయితే మాత్రం.. ఏది పడితే అది చూస్తారా జనం సల్మాన్ కోసం. ఇదే ధైర్యంతో వచ్చి అమీర్ ఖాన్ బాత్ రూమ్ లో కూర్చొని ఏడ్చే పరిస్థితి తెచ్చుకున్నాడు.. ఇప్పుడు సల్మాన్ అదే వరుసలో అమీర్ తర్వాత నిలబడ్డాడు. ఇంకో వారం రోజుల తర్వాత సల్లూ భాయ్ పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే భయంగా ఉంది.