మరో రెండు వారాల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఏడాది పూర్తవుతుంది. దీంతో రెండు దేశాల వార్ ఆఫ్ యాక్షన్ కూడా మారుతోంది. ఫిబ్రవరి 24లోగానైనా యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తాయి అని అంతా భావించారు. అటు ఉక్రెయిన్, ఇటు రష్యా కూడా పట్టు వదలని సందర్భంలో భారత ప్రధాని మోడీ లాంటి వారు మధ్యవర్తిత్వం చేసైనా సరే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగటం లేదు సరికదా.. ఫిబ్రవరి 24 లోగా ఉక్రెయిన్ పై ఊహించని దాడి చేసి కైవసం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం పన్నాడంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. 5 లక్షల మంది సైనికులను ఏకకాలంలో యుద్ధానికి పంపి ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేసి స్వాధీనం చేసుకోవాలని పుతిన్ వ్యూహరచన చేస్తున్నాడన్న వార్త సంచలనంగా మారింది.
ఇంత కాలం వెనక్కి తగ్గేది లేదన్నట్టు ప్రవర్తించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. బయటి దేశాల మద్దతు క్రమంగా తగ్గిపోతుండటంతో దిగి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకేనేమో.. ఆల్ ఆఫ్ సడెన్‌గా జెలెన్ స్కీ యూరప్ లో పర్యటించాడు. మొదట సీక్రెట్‌గా బ్రిటన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ అంటూ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేశారు. మరోవైపు.. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో కేంద్రంగానే మాస్టర్ స్ట్రాటజీలపై ఫోకస్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ తమపై 5లక్షల మంది సేనల్ని మాస్కో యుద్ధానికి దించబోతున్నట్టు ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. అదే నిజమైతే ఉక్రెయిన్ యుద్ధభూమిలో అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమై నట్టే అంటున్నారు మిలటరీ ఎక్స్‌పర్ట్స్.
రష్యా యుద్ధాన్ని మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బ్రిటన్‌లో ఆకస్మికంగా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ రిషి సునక్, బ్రిటీష్ రాజు చార్లెస్‌తో భేటీ అయ్యారు. అనంతరం బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలోఫ్ స్కోల్జ్‌లను కలిశారు. రష్యాకు గట్టి సవాల్ విసిరేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపాలని ఫ్రాన్స్, జర్మనీలను జెలెన్‌స్కీ కోరారు. ఈ సమయంలోనే రష్యాపై విజయం సాధించడంతోపాటు శాంతి కోసం, యూరప్ కోసం, ప్రజలు తమ హక్కులను పొందేందుకు తమ దేశం అండగా ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సాయం అందించడానికి తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. యుద్ధంతో యూరప్ భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. రష్యా గెలవదు, గెలవకూడదని మాక్రాన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దేశం.. యూరోపియన్ ఫ్యామిలీలో ఒక భాగమని పేర్కొన్నారు. జర్మనీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మానవతా సహాయం అందించిందని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత వరకు అండగా నిలుస్తాం అని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు లియోపార్డ్ ట్యాంకులను ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది. మొదటి ట్యాంక్ బెటాలియన్ ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్ నగరం కైవ్‌కు చేరుకుంటుందని జర్మనీ రక్షణ మంత్రి తెలిపారు. అమెరికా, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు పలు ట్యాంకులు, ఆయుధాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత జెలెన్‌స్కీ తొలిసారి యూరప్‌లో పర్యటిస్తున్నారు. బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రసంగించిన జెలెన్‌స్కీ.. బ్రిటన్ ప్రజలకు ఉక్రెయిన్ వార్ హీరోస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఓవరాల్‌గా జెలెన్‌స్కీ యూరప్ పర్యటన టార్గెట్ మరిన్ని ఆయుధాలు, వీలైనంత త్వరగా అందుకోవడం.. వాటితో మాస్కో సేనల భరతం పడటమే. దీనంతటికీ ఫిబ్రవరి 24ను ఉక్రెయిన్ అధ్యక్షుడు డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మాస్కో అంతకుమించిన యాక్షన్‌ను
సిద్ధం చేసిందన్న వార్త ఉక్రెయిన్‌ను కలవరపెడుతోంది.నిజానికి.. జెలెన్‌స్కీ యూరప్ టూర్ తర్వాత వాళ్లిచ్చే ఆయుధాలు ఎంత త్వరగా అందితే అంత త్వరగా పోరాడే వీలుంటుంది. కానీ, గతకొంత కాలంగా యుద్ధం ముగింపు విషయంలో మాస్కో ఫుల్ క్లారిటీ తో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిర్కాన్ సహా అత్యాధునిక మిస్సైల్ వ్యవస్థలతో పాటు పలు ఆయుధాలను క్రెమ్లిన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో యుద్ధం మొదట్లో కీవ్ వైపు పంపిన భారీ మిలటరీ కాన్వాయ్‌కు ఏమాత్రం తగ్గకుండా మరోసారి భారీ స్థాయిలో బలగాలను పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉక్రెయిన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమపై దాదాపు 5 లక్షల మంది సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్టు ఆరోపిస్తోంది. అదే నిజమైతే యుద్ధం మొదట్లో రష్యా కాన్వాయ్‌ను అడ్డుకున్నంత ఈజీగా ఇప్పుడు వారిని అడ్డుకోవడం ఉక్రెయిన్ సేనలకు సాధ్యం కాదు. ఎందుకంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు అవసరమైనంత లేవు. ఇదే సమయంలో అమెరికా సహా తాజా యూరప్ దేశాలు ప్రకటించిన ఆయుధాలు ఎప్పుడు చేతికి అందుతాయో తెలీని పరిస్థితి. అందుకే.. జెలెన్‌స్కీ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.వాస్తవానికి.. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు రష్యన్ల వశమయ్యాయి. రీసెంట్‌గా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ సైతం పలు నగరాలపై పట్టు సాధించింది. ఇలాంటి సమయంలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తే రిజల్ట్ దారుణంగా మారడం ఖాయం. యుద్ధం మొదట్లో తుర్కియే డ్రోన్లతో రష్యా సేనలను ఉక్రెయిన్ ఎదుర్కొంది. ఆ డ్రోన్లతోనే రష్యా భారీ మిలటరీ కాన్వాయ్‌ను తునాతునకలు చేసింది. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర అలాంటి ఆయుధాలు నిండుకున్నాయి. మరో దఫా డ్రోన్లు ఇచ్చే పరిస్థితి లో తుర్కియే లేదు. దీనికితోడు మాస్కో ఇరాన్ నుంచి తెచ్చిన తక్కువ ధర డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతుంది. ఇలాంటి సమయంలో లక్షల మంది సేనలను ఉక్రెయిన్‌లో మోహరిస్తే.. ఉక్రెయిన్ వేడుక చూడ్డం మినహా చేసేదేం ఉండకపోవచ్చు. అందుకే, ఇరు దేశాల మధ్య యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశాలున్నాయంటున్నారు మిలటరీ నిపుణులు.
పతాక స్థాయికి యుద్ధం : 5 లక్షల మందితో రష్యా సైన్యం దాడికి సిద్ధం
Published on