రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మెన్ దిమిత్రి మెద్వెదేవ్ ఊహించని షాకిచ్చాడు. ఐసీసీ భవనంపై మిసైల్ దాడి చేస్తామంటూ హెచ్చరించాడు మెద్వెదేవ్. “మీ భిల్డింగ్ మా మిసైల్ కు ఎక్కువ దూరంలో లేదు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి.. రష్యా మిసైల్ ఏ క్షణమైనా మీ మీద పడవచ్చు..” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఓ దయనీయ సంస్థ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు. రష్యా హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ నేరాలపై విచారణ చేపట్టే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకే రష్యా మిసైల్ హెచ్చరికలు చేయటం ఊహించని పరిణామం.
ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. అక్కడి నుంచి పిల్లలను అక్రమంగా తమ దేశంలోకి రవాణా చేస్తోందంటూ ఐసీసీ ఆరోపించింది. రష్యా అధ్యక్ష హోదాలో పుతిన్ పలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడంటూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రష్యా తీవ్రంగా రియాక్టైంది. ఏకంగా కోర్టు భవనాన్నే పేల్చేస్తానంటూ హెచ్చరించింది. నిజానికి రష్యా ఏనాడూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును లెక్కచేయలేదు సరికదా.. అసలు ఐసీసీని మేం గుర్తించనేలేదంటూ గతంలోనే రష్యా స్పష్టం చేసింది. రష్యా హెచ్చరికలపై అమెరికా సహా ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.