ఇంత కాలం ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా తలపడిన అమెరికా, రష్యా దేశాలు.. ఇప్పుడు నేరుగా పరోక్ష యుద్ధానికి దిగాయి. అమెరికా, రష్యా దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు నేరుగా దాడులకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో అమెరికా వైమానిక దళం స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్ యుద్ధ విమానాలపైకి ష్యాకు చెందిన ఎస్‌యూ-34 ఫైటర్ జెట్లు దూసుకు వెళ్లడమే కాకుండా.. మంటలు రాజేసి ఎంక్యూ-9 రీపర్ల సామర్థ్యం దెబ్బతినేలా చేశాయి. ఇందుకు సంబంధించి అమెరికా వీడియోను విడుదల చేసింది. సిరియాలోని ఐఎస్ఐఎస్ పై తమ డ్రోన్లు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాయనీ.. ఆ డ్రోన్ల పైకి రష్యను యుద్ధ విమానాలు దూసుకెళ్ళి తమ డ్రోన్లను ధ్వంసం చేసిందనీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. రష్యా చేసిన ఈ పని వల్ల చిన్నపాటి యుద్ధమే జరిగింది రెండు దేశాల మధ్య. ఇరు దేశాల ప్రతినిథులు ఒకరికి ఒకరు నేరుగా హెచ్చరికలు చేయటం.. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవటంతోో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైందనే భావించింది ఐక్యరాజ్యసమితి. కానీ.. చివరకు ఇరుదేశాలు కాస్త శాంతించాయి.
ఈ నెల 5న ఉదయం 10 గంటల 40 నిమిషాలకు జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మరోసారి అమెరికా డ్రోన్లను రష్యా ఫైటర్ జెటంలు వెంటాడాయి. ఈ రెండో ఘటనకు వాయవ్య సిరియా వేదికయింది. వాస్తవానికి.. ఈ డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. కేవలం నిఘా వ్యవస్థల కోసం వీటిని ఉపయోగిస్తారు. అలాంటి డ్రోన్లపై రష్యా దాడి చేయడం చూస్తుంటే అమెరికాతో తేల్చుకోడానికి దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా సెంట్రల్ కమాండ్‌హెడ్ జనరల్ ఎరిక్ కురిల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయత్నాలను రష్యా అడ్డుకోవడం వల్ల సిరియా గగనతలంలో మరింత ముప్పును పెంచుతోందని చెప్పారు. ఇవే పరిస్థితులు కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారిపోతాయంటూ పరోక్షంగా పుతిన్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు.
ఈ రెండు ఘటనలకు ముందు కూడా అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేశాయి. నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను మాస్కో ఫైటర్ జెట్లు కూల్చివేస్తున్న దృశ్యాలను కూడా పెంటగాన్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఎంక్యూరీపర్- 9 డ్రోన్ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. డ్రోన్‌పై రష్యా విమానాలు వెళ్లినప్పుడు దానికి ఏర్పాటు చేసి ఉన్న కెమెరాకు అంతరాయం కలిగింది. ఎస్‌యూ-27 ఫైటర్ జెట్.. డ్రోన్‌పై ఇంధనాన్ని విడుదల చేయడం వల్ల డ్రోన్ దెబ్బతిందని పెంటగాన్ వివరించింది. ఐతే ప్రొపెల్లర్ ధ్వంసం కావడం వల్ల డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయాల్సి వచ్చిందని అమెరికా.. ఘటన జరిగాక వెల్లడించింది. ఆ సమయంలో ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని హెచ్చరించిం ది. అమెరికా వ్యాఖ్యలపై రియాక్టయిన మాస్కో.. తమ యుద్ధ విమానాలు రీపర్ డ్రోన్‌ను ఢీకొట్టడం గానీ, కాల్పులు జరపడం గానీ చేయలేదని పేర్కొంది. తమ సరిహద్దులకు సమీపంలో ఎగిరిన డ్రోన్.. రష్యాలోకి చొచ్చుకొచ్చిందని తెలిపింది. రష్యా యుద్ధ విమానాలను అడ్డగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి నీటిలో కూలిపోయిందని కౌంటర్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. సిరియాలో అయినా నల్ల సముద్రంపైన అయినా క్రెమ్లిన్ ఆదేశాలు లేకుండా అమెరికా డ్రోన్లపై దాడులు జరిగే ఛాన్స్ లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మాస్కో ఎయిర్ ఫోర్స్ ఈ రేంజక్ యాక్షన్‌లోకి దిగుతుంది. అంటే, తాజా దాడులు కూడా పుతిన్ ఆదేశాలతో జరిగాయన్న మాటే. జరుగుతున్నది చూస్తుంటే పుతిన్ అన్నింటికీ తెగించే యాక్షన్ కు ఆదేశాలిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటు ఉక్రెయిన్ కధ ముగించేందుకు బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించిన పుతిన్.. ఇప్పుడు సిరియా వేదికగా అమెరికాను టార్గెట్ చేసి నాటో కూటమికి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇలా పదే పదే అమెరికా డ్రోన్లు రష్యా ఫైటర్ జెట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను అమాంతం పెంచేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత ఇరు దేశాలు ఇలా నేరుగా ఘర్షణ పడటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు..
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికాకు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్ లేదంటే డ్రోన్లపై మాస్కో దాడులు చేయడం ఇప్పుడే అని విశ్లేష కులు చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికా-రష్యా మధ్య యుద్ధానికి సిరియా దాడులు తొలి అడుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రక్షణ నిపుణులు. అదే జరిగి తాజాఉద్రిక్తతలు తీవ్రరూపుదాల్చితే ప్రపంచానికి అంతకుమించిన శాపం మరొకటి ఉండదు. ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల అన్ని రకాలుగా నష్టపోయిన పుతిన్.. అమెరికా విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదనీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం తప్పదనీ.. ఇది ప్రపంచ యుద్ధానికి మొదటి అడుగు అవుతుందనీ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.