తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో రేవంత్ రెడ్డి కారు తన ముందు కారును బలంగా ఢీకొట్టగా.. వెనుక నుంచి రేవంత్ రెడ్డి కారును మరో కారు ఢీకొట్టింది. బెలూన్లు ఓపెన్ కావటంతో రేవంత్ రెడ్డికి ఘోర ప్రమాదం తప్పినట్టైంది. కాన్వాయ్ లోని కార్లలో ఉన్న మీడియా ప్రతినిథులకు చాలా మందికి గాయాలయ్యాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం వాటిల్లకపోవటం అదృష్టంగా చెప్పుకోవాలి. సిరిసిల్ల జిల్లాలోని శ్రీపాద ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో ఏదో అడ్డు రావటం వల్ల కాన్వాయ్ లోని మొదటి కారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందనీ.. దీంతో అన్ని కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయనీ స్థానికులు చెప్తున్నారు.