గురువారం ఉదయం సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట లోని డెక్కన్ స్పోర్స్ షోరూమ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం.. సమయం గడిచేకొద్దీ తీవ్రరూపం దాల్చుతోందే తప్ప మంటలు ఆరటం లేదు. మొదట చిన్న ప్రమాదంగానే కనిపించిన ఈ ఘటన.. రాను రానూ తీవ్రమైంది. ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అప్పటి నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా.. మంటలు అదుపులోకి రాకపోగా చుట్టుపక్కల బిల్డింగులకు వ్యాపిస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కన ఇళ్ళలోని జనాలను రోడ్డు మీదనే నుంచోపెట్టిన పోలీసులు.. ఎన్ని ఫైరింజన్లు, కెమికల్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించటం లేదు.
ఫైర్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం.. మరి కొద్ది సేపట్లో ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోనుంది. బిల్డింగ్ లోపల ఉన్న స్లాబులన్నీ వరుసగా కుప్ప కూలగా.. ప్రస్తుతానికి బయటిగోడలు మాత్రమే మంటల్లో కాలుతున్నాయి. టాప్ ఫ్లోర్ కూలటానికి సిద్ధంగా కనిపిస్తోంది. ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించగా.. కొద్ది సేపటి క్రితం తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. సుమారు ఆరున్నర గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించటం చూస్తుంటే.. ఈ మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదని స్థానికులు చెప్తున్నారు. రామ్ గోపాల్ పేట ప్రాంతమంతా దట్టమైన పొగతో కనీసం శ్వాస తీసుకోలేని పరిస్తితి ఉంది. ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలి పక్కనున్న భవనాలపై పడుతుందో.. మంటలు ఎప్పుడు వ్యాపిస్తాయో తెలియక ఆ చుట్టు పక్కల భవనాల వాసులు గజగజ వణుకుతున్నారు.