ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అప్పుడప్పుడు కాంట్రవర్శీ స్టేట్మెంట్లు ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నామధ్య ముస్లింలు, క్రైస్తవులు అంటూ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి తర్వాత నేను అలా అనలేదు అంటూ సారీ చెప్పిన రాందేవ్ బాబా.. ఇప్పుడు మరో విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లోకెక్కాడు. భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలైన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా, బిర్లా వంటి వాళ్ళతో తనను తాను పోల్చుకున్న రాందేవ్ బాబా.. వాళ్ళందరికంటే తన సమయమే గొప్పదంటూ చెప్పుకొచ్చారు. స్వప్రయోజనం, వ్యాపారం కోసమే తమ జీవితంలో 99 శాతం సమయాన్ని కేటాయించే ఈ వ్యాపార దిగ్గజాల వల్ల సామాన్యుడికి పెద్దగా ఉపయోగం లేదన్న ఆయన.. సమాజం కోసం సమయాన్ని గడిపే తన టైమే గొప్పదంటూ చెప్పుకొచ్చాడు.
గోవాలో పతంజలి సంస్థ సీఈఓ అయిన ఆచార్య బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం జరిగింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వేదికపై ఉన్న వాళ్ళు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. పతంజలి సంస్థ మూతపడే స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదగటానికి ఆచార్య బాలకృష్ణ పనితీరు, జవాబుదారీ తనమే కారణమని బాబా రాందేవ్ బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తాడు. విచిత్రం ఏమిటంటే.. బాలకృష్ణ కూడా తన జీవితంలోని అత్యధిక సమయాన్ని పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటం కోసమే కేటాయిస్తాడు మరి.
అదానీ, అంబానీ, టాటా, బిర్లా కంటే నేనే గ్రేట్-బాబా రాందేవ్
Published on