రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ.. అక్కడే జరిగిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అడుగుపెట్టడం కంటే తల నరుక్కోవటం మేలనీ.. తనకు అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటాననీ చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ.. మొదటిసారిగా గాంధీ వారసులకు కాకుండా బయటి వారికి ఏఐసీసీ పగ్గాలు అప్పజెప్పారు. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్న విషయం తెలిసిందే.
బీజేపీ రహిత భారత దేశాన్ని సాధిస్తామంటూ రాహుల్ గాంధీ పదే పదే చెప్తుంటాడు. ఎక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నా రాహుల్ అలాగే ఏదో ఒక వివాదాస్ఫద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మహారాష్ట్రలో జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో దామోదర్ సావర్కర్ ఓ దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న కాస్తో కూస్తో ప్రేమ కూడా లేకుండా పోయిందని ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.