పరువు నష్టం కేసులో జైలు శిక్ష పడిన మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి తన తల్లి సోనియా నివాసానికి వెళ్ళిపోయాడు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ 2005 ఏప్రిల్ 22న ఢిల్లీ లోని తుగ్లక్ లేన్ 12వ ప్రభుత్వ అధికారిక నివాసానికి మారాడు. సరిగ్గా ఇప్పుడు ఏప్రిల్ 22వ తేదీనే రాహుల్ తన అధికారిక గృహాన్ని యాధృచ్ఛికంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. 10 జన్ పథ్ లోని సోనియా అధికారిక నివాసానికి రాహుల్ తన సామాగ్రిని షిఫ్ట్ చేసుకున్నాడు. పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన వెంటనే ఎంపీలు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చి రాహుల్ ను ఇల్లు ఖాళీ చేయిస్తే.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ రాహుల్ పై కక్ష సాధిస్తున్నదంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం చేసుకున్న ఖర్మకు ఫలితం అనుభవించక తప్పదంటూ హిత బోధ చేస్తున్నారు.
లోక్ సభ సాధారణ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ.. దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఉంటుంది ఎందుకో.. అంటూ పరోక్షంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని వివాదాస్ఫద వ్యాఖ్య చేయగా.. గుజరాత్ ఎమ్మెల్యే అయిన పూర్ణేశ్ మోడీ రాహుల్ పై పరువునష్టం కేసు దాఖలు చేశాడు. గత నెల ఈ కేసును విచారించిన గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సూరత్ కోర్టుపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ రాహుల్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. ప్రస్తుతం రాహుల్ ఆండ్ టీమ్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీకి చుక్కెదురైతే ఇక రాహుల్ రాజకీయ జీవితం ముగిసినట్టే అనే అంచనాలు వినిపిస్తున్నాయి.