మోదీ పేరున్న వాళ్ళంతా దొంగలే అంటూ కాంట్రవర్సీ చేసి ఏకంగా జైలు శిక్షకు గురైన మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలే మాట్లాడి మరో పెద్ద తేనెతుట్టెను కదిలించాడు. మోదీ అనే పేరున్న వాళ్ళకు క్షమాపణ చెప్తారా అంటూ మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను సావర్కర్ ను కాదు.. గాంధీని.. గాంధీలు క్షమాపణలు చెప్పరు.. అంటూ మాట్లాడాడు రాహుల్. దీంతో సావర్కర్ వారసులు దీనిపై రియాక్ట్ కావాల్సి వచ్చింది. స్వాతంత్ర సమరయోధుడు వీర్ దామోదర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ దీనిపై స్పందిస్తూ.. రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తాత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన దేశభక్తుడు అనీ.. అలాంటి వాళ్ళపై మాట్లాడే ముందు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ రంజిత్ వ్యాఖ్యానించారు.
“చిన్న పిల్లల్లా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదు. మా తాత బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షపమాణ చెప్పారో రాహుల్ గాంధీ నిరూపించాలి. అందుకు సంబంధించిన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా రాహుల్..?” అంటూ తీవ్రంగా స్పందించారు. దేశభక్తులపై కూడా రాజకీయాల కోసం తప్పుడు మాటలు మాట్లాడటం చాలా పెద్ద నేరంగా పరిగణించాలని కోరారు. రాహుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. మోదీ వ్యాఖ్యల వివాదంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవటమే కాకుండా నెల రోజుల్లో స్టే తెచ్చుకోకపోతే రెండేళ్ళు జైళ్ళో ఉండాల్సిందే.