కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే.. అంటే ఈ రోజు లోక్ సభ సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. రాహుల్ పై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం నిర్ణయం వెలువరించింది. 2013లో రూపొందించిన ఆర్టికల్ 102 లోని సబ్ క్లాస్ ప్రకారం జైలు శిక్ష పడిన వారు మరియు నేరం రుజువైన వారు చట్టసభల్లో ఉండటానికి అనర్హులవుతారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షకు గురైన వాళ్ళు శిక్షాకాలం మరియు శిక్ష ముగిసిన ఆరేళ్ళ వరకూ చట్టసభలకు పోటీ చేయటానికి అనర్హులుగా పరిగణించబడతారు. దీని ప్రకారం రాహుల్ పై వెంటనే లోక్ సభ సచివాలయం చర్యలు తీసుకుంది.
2019 కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న క్రమంలో రాహుల్ వివాదాస్ఫద వ్యాఖ్య చేశాడు. దొంగలందరికీ చివర మోడీ అనే పేరు ఉంటుంది ఎందుకో మరి.. అంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు దాఖలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కూడా సూరత్ కోర్టు ముందుంచగా.. అన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి రాహుల్ ను ప్రశ్నించాడు. మీరు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించగా.. రాహుల్ అవునని సమాధానం ఇవ్వటంతో న్యాయమూర్తి విచారణ పూర్తిచేసి జైలు శిక్ష ఖరారు చేశాడు. కాకపోతే.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశంతో పాటు శిక్షను నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చాడు. ఈ తీర్పుపై స్టే తెచ్చుకోలేకపోతే మరో 30 రోజులలో రాహుల్ జైలుకు వెళ్ళాటం ఖాయమే.