భారతదేశం మొత్తాన్ని శాసించి, మన సంపదను దోచుకెళ్లిన బ్రిటిషర్లు పూరీ జగన్నాథుని దేవాలయాన్ని మాత్రం ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ది మిస్టీరియస్ గాడ్ అంటూ పూరీ ఆలయాన్ని టచ్ చేయలేక వణికిపోయారు. దేశ సంపదనంతా దోచుకోగలిగారురు కానీ, జగన్నాథుని రత్న భాండా గారం తలుపును కూడా టచ్ చేయలేకపోయారు. పైగా శ్రీక్షేత్రం సంపద దొంగలపాలు కాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, అదంతా గతం. ఇప్పుడు మాత్రం బ్రిటిషర్లు దోచుకోలేకపోయిన జగన్నాథుని సంపద ఎంతవరకూ భద్రం అన్నదే అసలు ప్రశ్నంతా. కొన్ని దశాబ్దాలుగా రత్న భాండాగారం తలుపులు తెరుచుకోవడంలేదు. 50 ఏళ్లకు ముందు ఆ తలుపులు తెరిచినా సంపదను అంచనా వేయలేకపోయపోయారు. ఆ తర్వాత తెరుద్దామన్నా కుదరలేదు. దీనికి కారణం ఆ పురాతన రత్న భాండా గారం తలుపులకు సంబంధించిన తాళం కనిపించకుండా పోవడమే. ఆ తాళం ఎలా మిస్సయింది? ఎవరి దగ్గర ఉందనే ప్రశ్నలు ఏళ్ల తరబడి తొలిచేసిన వేళ.. ఆ మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్ ఓ కమిటీని నియమించింది.
2018 నవంబర్ 30.. జస్టిస్ రఘువీర్ దాస్ కమిషన్ కనిపించకుండా పోయిన తాళానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఆరోజే. కానీ, ఇది జరిగి నాలుగేళ్లు పూర్తయిపోయినా ఆ నివేదికలో ఏముందనేది బయటకు వచ్చిందే లేదు. 324 పేజీల రిపోర్ట్‌లో ఎలాంటి అంశాలు పొందుపరిచారో నవీన్ పట్నాయక్ సర్కార్ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇదే సమయంలో ఆ న్యాయ విచారణ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుశా? అక్షరాలా 22లక్షల 27వేల 918 రూపాయలు. మరి ఇంత ఖర్చుచేసి,
అంత సమయం కేటాయించి, 324 పేజీల రిపోర్ట్ చేతికందిన తర్వాత కూడా దానిపై సర్కార్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం నేటికీ మిలియన్ మార్క్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫలితంగా రత్న భాండాగారం కీ గల్లంతుపై న్యాయ విచారణ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఇరుపక్షాలైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరువురు ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి మిస్టీరియస్ గాడ్ విలువైన సంపద దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.
పూరీ జగన్నాథ్ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా?లేదా? అన్నదానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందంలోని సభ్యులు.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం ఒకటి లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. అయినా, రత్న భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. దీంతో ఒడిశా సర్కార్ దగ్గర నిజంగా తాళం ఉందా? లేదంటే వివాదం చెలరేగకుండా ఉండేందుకు అలా చెప్పారా? అనే ప్రశ్నలు వినిపించాయి.
భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా చెప్పారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలు అన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌ల నుంచి నిపుణులను పిలిపించినప్పటికీ.. అందులోని ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు. వాస్తవానికి.. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం.. దాదాపు 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఇతర విలువైన విలువైన రత్నాలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించిచారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయి నందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు. అయితే అవన్నీ 50 సంవత్సరాల క్రితం లెక్కలు. ఇప్పుడు ఆ సంపద ఎంతవరకూ ఉందనేది ఊహకందని ప్రశ్నే. ఎందుకంటే ఆ గది తాళం కనిపించకుండాపోయి చాలా కాలం అయింది.
జగన్నాథుని సంపదపై నిర్వహకుల లెక్కలు ఇలా ఉంటే.. చరిత్రకారులు మాత్రం మరోలా చెబుతున్నారు. 1926లోనే పూరీ రాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిష్ పాలకులు కలిసి పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారట. అందులో 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారట. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్ధాలు రావడమే. దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెబుతారు. వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ, జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించ లేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్‌గా అభివర్ణించారు. అంతేకాదు, తమ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ, నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదే సమయంలో ఒకవేళ రత్న భాండాగారం తాళం దొరక్కపోయినా ఆ గదులోపలికి వెళ్లడానికి ఓ మార్గం ఉందని చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా చెప్పారు. రహస్య మూడో గదిని చేరుకునేందుకు ఓ సొరంగ మార్గం ఉందన్నారు. ఐతే, అక్కడికి చేరుకోవాలంటే అంత సులువేం కాదన్నారు. ఆరహస్య మార్గానికి సంబంధించి 1926లో చెన్నైకు చెందిన అధికారులు కీలక వివరాలు నిథికి సంబంధించిన పట్టీపై రాసినట్టు గుర్తుచేశారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే అనంతపద్మనాభ స్వామి నేలమాలిగళకు మించిన సంపద రత్న భాండాగారంలో బయటపడొచ్చని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అలాగే, రత్న భాండాగారం లో అందరూ చెబుతున్నట్టు మూడు గదులు కావనీ, వాటికింద మరిన్న రహస్య గదులున్నాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వాస్తవానికి.. 46 మంది రాజులు కొన్ని వందల యుద్ధాలు చేసి, వాటిలో విజయం సాధించిన ప్రతిసారీ ఓటమి పాలైన రాజ్యానికి చెందిన సంపదనంతా తెచ్చి జగన్నాథుని పాదాల దగ్గరే ఉంచేవారట. స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర, వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది. అందుకే, 1978 లెక్కలు నిజాలు కావని, రత్న భాండాగారంలోని అన్ని గదులు తెరవలేదనే వాదనలు వినిపిస్తాయి.
తాళం కనిపించకుండా పోయింది.. సర్కార్ చేయించిన డూప్లికేట్ కీ కూడా మిస్సయింది.. ఐనా రత్న భాండాగారం తెరవడానికి రహస్య సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు కూడా. వీటన్నింటికీమించి రత్న భాండాగారం తెరవకపోతే కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని పురావస్తు శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. అదే జరిగితే ఆలయానికి కూడా ప్రమాదమే. ఎందుకంటే రత్న భాండాగారం ఉంది జగన్నాథుని పాదాల కింద అనే విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం రత్న భాండాగారం తెరవడం లేదు. పైగా కమిటీల నివేదికల్లో కూడా ఏముందన్నది బయటకు రానీయడం లేదు. ఇలాంటి సమయంలో హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు కావడం, జులై 10లోగా లెక్క తేల్చాలని కోర్టు ఆదేశించడం దేశ వ్యాప్తంగా ఉత్కంఠను అమాంతం పెంచేసింది. ఇదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన బీజేపీ, కాంగ్రెస్‌లు.. ఆలయంలోని ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని పట్టుబడుతున్నాయి. ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఆ నివేదిక చేరినప్పటికీ ప్రభుత్వం దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసిందని బీజేపీ విమర్శిస్తోంది.
ఒడిశా కాంగ్రెస్ సైతం సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. డూప్లికేట్ తాళాలు దొరికినప్పటికీ గదిని తెరవడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందని ప్రశ్నిస్తోంది. పారదర్శకత పాటిస్తే వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఆధ్యాత్మిక సంఘాలు, భక్తులు, సేవాయత్‌లు సైతం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించిన అధికార బీజేడీ ఓ ప్రకటన విడుదల చేసింది. 38 ఏళ్లుగా ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదని.. దీనిని విపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దంటూ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మొత్తంగా.. పూరీ జగన్నాథుని రత్న భాండాగారం మిస్టరీ వీడాలంటే జులై 10వరకూ వేచి చూడక తప్పేలా లేదు.