ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రాజకీయా పార్టీలు తమ ప్రభావాన్నీ.. ఓటు బ్యాంకును పెంచుకునేందుకు సోషల్ మీడియాను దాటి సినిమాల దాకా వచ్చేశాయి. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం చుట్టూ అల్లిన కథతో యాత్ర సినిమాను తెరకెక్కించి జనాన్ని రాజన్న ఎమోషన్లో కట్టి పడేసి.. ఆ ఎమోషన్ ను ఓట్ల రూపంలోకి మార్చుకున్నాడు వైఎస్ జగన్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో వ్యూహం పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ప్రతిపక్ష పార్టీ నేతలను నెగెటివ్ గా చూపించి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు వేసిన స్కెచ్.. వ్యూహం సినిమా. ఇప్పుడు బీజేపీ కూడా సినిమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్లాన్లు వేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. బీజేపీకి అనుకూలంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసిన పూరీ.. బీజేపీ నేతలకు వినిపించాడట. పూరీ స్క్రిప్టు విని ఇంప్రెస్ అయిన సదరు బీజేపీ నేత.. 30 కోట్లు బడ్జెట్ కూడా ఇచ్చేశాడట.
కర్ణాటక బీజేపీ నేత మంజు.. కొద్ది రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయనే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఓ సినిమా చేద్దామంటూ కొంత మంది డైరెక్టర్లను కలిశాడు మంజు. పూరీని కలిసినప్పుడు వినిపించిన స్క్రిప్టుకు మంజు ఫిదా అయిపోయాడట. దీంతో పూరీతో కలిసి సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడట. ప్రస్తుతం సినిమా కథలోని క్యారెక్టర్లకు నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట వీళ్ళిద్దరూ. కాస్ట్ ఓకే కాగానే సినిమా మొదలు పెట్టి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. పూరీ ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలుపెట్టే లోపు బీజేపీ సినిమాను బుల్లెట్ స్పీడ్ తో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాకపోయినా.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.