ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో నేతల విమర్శల వాడి ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ తో పాటు వేదికను పంచుకున్న కేరళ సీఎం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడగా.. ఆయన తర్వాత ప్రసంగించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మోడీపై తీవ్ర విమర్శలు చేశాడు. అధికారం కోసం మోడీ ఏ పనైనా చేస్తాడనీ.. అధికారం రాని చోట ఎమ్మెల్యేలను కొనేసి.. ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం దక్కించుకోవటమే ఆయనకు కావాల్సింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవసరమైతే ఉప ఎన్నికలు సృష్టించి రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసి.. బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందన్నాడు.
ఇక ప్రతి సంవత్సరం ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై జెండా ఎగరవేసి ఉపన్యాసం ఇచ్చే మోడీ.. ప్రతి సంవత్సరం చెప్పిందే చెప్పటం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. ప్రతి సారీ దేశంలో నిరుద్యోగం, తీవ్రవాదం, అవినీతి అని మాట్లాడి.. ఉపన్యాసం పూర్తయ్యాక వాటిని మరిచిపోతాడన్నారు. దేశాన్ని ఎలాగో మార్చలేనప్పుడు.. కనీసం ఉపన్యాసం మార్చుకో అంటూ మోడీకి వార్నింగ్ ఇచ్చాడు భగవంత్ సింగ్. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమ్మేసిన మోడీ.. మీడియాను మాత్రం కొనేశాడని ఎద్దేవా చేశాడు. భగవంత్ సింగ్ వ్యాఖ్యలు సభను హీటెక్కించాయి. ఇక మిగిలిన నేతలు ఏ రేంజ్ లో విరుచుకుపడతారో చూడాలి.