ప్రియాంకా రాబర్ట్ వాద్రా గాంధీ.. ఇంత పెద్ద పేరున్నా పాపం ఆమె ఇంటి పేరు మాత్రం లేదు అందులో. ఆమె పేరు ప్రియాంక.. ఆమె భర్త పేరు రాబర్ట్ వాద్రా.. చివర్లో గాంధీ.. అంతా కలిపితే ఆమె పేరన్నమాట. ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఐసీయూలో మూలుగుతున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఢిల్లీలో పక్కనబెట్టి తెలంగాణలో బలోపేతం చేస్తారట. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారనేది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల భావన. తెలంగాణలో కాంగ్రెస్ ను గాడిలో పెట్టడానికి ఇప్పటికే ప్రయత్నించిన వాళ్ళ పేర్ల లిస్టు.. ఓ చిన్నపాటి ఓటర్ల జాబితా అంత ఉంటుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో రగిలిన అంతర్గత వర్గపోరును చల్లార్చేందుకు ఫైరింజన్లు పట్టుకొని చాలా మందే వచ్చి వెళ్ళారు. దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, మణిక్కం ఠాగూర్, మానిక్ రావ్ థాక్రే వీళ్ళు గట్టి ప్రయత్నాలే చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. వీళ్ళతో అయ్యేలా లేదని మధ్యలో రెండు మూడు సార్లు రాహుల్ గాంధీ కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు.. కానీ రాహుల్ అటు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఇక్కడ మనోళ్ళు తన్నుకోవటం షరా మామూలే.
ఓసారి జగ్గన్న ఫైర్ అవుతాడు.. ఇంకోసారి ఉత్తమ్ వార్నింగ్ ఇస్తాడు.. ఆ తర్వాత భట్టి విక్రమార్క.. ఆ తర్వాత వి హనుమంతరావు.. ఇలా ఒకరు తగ్గగనే మరొకరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పాతాలానికి తొక్కేసే బాధ్యత నెత్తిన పెట్టుకుంటారు. ఇవన్నింటికీ కారణం మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్తారు. పక్క పార్టీ నుంచి గట్టి ఆఫర్ ఏదైనా రాగానే కండువా మార్చేయాలి.. అందుకు కారణం రేవంత్ రెడ్డి ప్రవర్తనే అంటూ పోతూ పోతూ నిప్పు పెట్టి పోవాలి.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టగానే మరో నేత పోటీగా పాదయాత్ర మొదలుపెడతాడు.. అడిగితే పార్టీ కోసం అని చెప్తాడు. ఇలా ప్రతిదానిలో నాయకుడికి ఎదురు తిరిగి సొంత పార్టీని నాశనం చేసుకోవటం తప్ప పార్టీకి పనికొచ్చే నాయకుడు ఒక్కరు కూడా కనిపించరు తెలంగాణ కాంగ్రెస్ లో. ఇప్పటికే తలపండిన ఢిల్లీ నేతలు యుద్ధాలు చేసీ చేసీ అస్త్ర సన్యాసం తీసుకున్న వేళ.. సాక్షాత్తూ సోనియా, రాహుల్ కలగజేసుకొని సర్దిచెప్పీ చెప్పీ మా వల్ల కాదు అని ఇంటికెళ్ళి తలుపులు వేసుకున్న వేళ.. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఏం చేస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. జాతీయ నేతలు వచ్చినప్పుడల్లా సభ ఏర్పాట్ల కోసం లోకల్ లీడర్ల జేబులకు చిల్లులు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేదీ లేదు.. ఓట్లు రాబట్టే రాజకీయం చేసేదీ లేదు. చూద్దాం.. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక హైదరాబాద్ సభ కాంగ్రెస్ లో ఎంత పాటి బలం నింపుతుందో.