యూత్ డిక్లరేషన్ పేరిట మొన్న ప్రియాంకా గాంధీ హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తొలిసారి అడుగు పెట్టిన ప్రియాంకా గాంధీ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. సోనియా గాంధీ-తెలంగాణ సెంటిమెంట్ ను తట్టిలేపే ప్రయత్నం చేసింది. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తన తల్లి సోనియా గాంధీ.. కానీ ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసింది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కలిసి ఓ భారీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచినట్టుగానే ప్రియాంకను కూడా తెలంగాణలో పోటీ చేయించి గెలిపించటం ద్వారా కాంగ్రెస్ కు భారీ సంఖ్యలో ఓట్లను మళ్ళించాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందట. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నల్గొండ జిల్లా నుంచి ప్రియాంకను పార్లమెంట్ కు పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచిన చరిత్ర ఇక్కడ ఉండనే ఉంది. ఇప్పుడు ఇందిరా గాంధీ రాజకీయ వారసురాలిని అంటూ ప్రతి సభలోనూ చెప్పుకొచ్చే ప్రియాంకా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసి ఒకప్పటి ఇందిర గెలుపు సెంటిమెంట్ ను తెలంగాణ ఓటర్లకు మరోసారి రుచి చూపించాలని భావిస్తున్నదట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావటానికి ప్రియాంకా గాంధీని తెలంగాణ బరిలో నిలపటం అనేది అద్భుతమైన వ్యూహంగా పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట. ప్రియాంకా గాంధీని తెలంగాణలో పోటీ చేసి ఇందిరా-సోనియా-తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ వ్యూహం రచించి తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి జాతీయ కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి టీ కాంగ్రెస్ కొత్త వ్యూహం రచిస్తోందని ఇక్కడి కాంగ్రెస్ వర్గాల సమాచారం. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందనటం నిజమే కానీ.. ఈ వ్యూహం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తుందని భావిస్తే మాత్రం అది తప్పుడు అంచనాయే అవుతుంది.