ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ పర్యటనలో కూడా మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కోసం కొన్ని బహుమతులు తీసుకెళ్ళాడు. ఆ బహుమతుల్లో తెలంగాణ పట్టు చీర ఉండటం విశేషం. తెలంగాణలోని పోచంపల్లి పట్టు చీరను మాక్రాన్ సతీమణి బ్రిగెటీ కోసం బహుమతిగా అందజేయటం ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్ లోని మీడియాతో పాటు ఫ్రాన్స్ మీడియా పోచంపల్లి చీరపై చర్చించటం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కనిపిస్తోంది. భారతీయ మహిళలు అంటే సాధారణంగా విదేశీయులకు గుర్తు వచ్చేది అచ్చమైన చీరకట్టే. భారతీయ సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనదిగా భావించే చీరను ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా అందజేయటాన్ని మీడియా హైలైట్ చేస్తోంది.
చందనం కర్రతో చేసిన పెట్టెలో పోచంపల్లి పట్టుచీరను స్వయంగా తన చేతులతో తానే మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడి చేతికి అందజేయటం.. ఆయనకు పోచంపల్లి చీర ప్రత్యేకత గురించి వివరించటానికి సంబంధించిన ఫోటోలను అన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇంకా చాలా అపురూపమైన బహుమతులు ఈ పర్యటన సందర్భంగా మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందజేసినప్పటికీ తెలంగాణ పోచంపల్లి పట్టు చీర హైలైట్ కావటం విశేషం. ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐ ఈ చీరకు సంబంధించిన ఫోటోను ట్విటర్ లో పోస్టు చేయగా.. ఆ పోస్టు విపరీతమైన లైక్స్, షేర్స్ తో వైరల్ గా మారింది. అసలైన భారతీయ సంస్కృతికి చిహ్నం తెలంగాణ పోచంపల్లి పట్టు చీర అంటూ ఏఎన్ఐ పోస్టులో పేర్కొంది.