బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతాడు అనే దానిపై స్పష్టత రాలేదు.
ఓసారి కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి చర్చించాడు.. ఆ తర్వాత బీజేపీ నేతలతో మంతనాలు జరిపాడు.. వైఎస్ షర్మిళ తల్లిని కలిసి మాట్లాడాడు.. ఇలా అన్ని పార్టీల అగ్రనేతలతో కలుస్తున్నాడే తప్ప ఏ పార్టీకి వెళ్తాడనేది మాత్రం ఇప్పటికీ చెప్పింది లేదు. ఇవన్నింటికీ మించి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందంటూ ఆ మధ్య బాంబు పేల్చాడు పొంగులేటి. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట అందుకున్నాడు. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికారంలోకి రావటం పక్కా అంటూ అతి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు పొంగులేటి. ఖమ్మం జిల్లా మొత్తం తన హవా ఉందనీ.. తాను ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓట్లు పడతాయనీ తరచూ వ్యాఖ్యానిస్తుంటాడు.
ఆ మధ్య రాహుల్ గాంధీ స్వయంగా పొంగులేటిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగితే.. ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలనీ.. హైదరాబాద్ లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లు తను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలనీ అడిగాడట. పొంగులేటి కోరిన కోరికను చూసి అవాక్కైన రాహుల్ గాంధీ.. మీరు మీరు తేల్చుకోండి అంటూ రేవంత్ రెడ్డికి అప్పజెప్పి ఢిల్లీ విమానం ఎక్కేశాడు. బీజేపీలోకి రావాలంటే కూడా ఇలాంటి కండిషన్లే పెడుతున్నాడట ఈయన. పొంగులేటి వ్యవహార శైలితో చిర్రెత్తుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. పొంగులేటి బీజేపీలోకి రాడు.. అంటు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంత జరిగినా పొంగులేటి మాత్రం వెనక్కి తగ్గటం లేదు సరికదా.. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుందంటూ గొప్పలకు పోతున్నాడు. ఇప్పటికీ తన అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం అంటూ తరచుగా మీటింగులు పెట్టి తన బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు ఎక్కవ సమయంలేని ఈ తరుణంలో పొంగులేటి త్వరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోకపోతే.. ఆ తర్వాత తానే వస్తానన్నా ఏ పార్టీ చేర్చుకోదేమో ఆలోచించుకుంటే మంచిది. ఏది ఏమైనా.. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ కు దండం పెట్టాలి.