సొంత పార్టీపైనా, పార్టీ అధినేత కేసీఆర్ పైనా విమర్శలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇంకా ఏ పార్టీలో చేరతాడు అనేది తేలటం లేదు. బీజేపీ నేతలు పొంగులేటికి మంచి ఆఫర్ ఇచ్చారనీ.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటాడని అన్నారే కానీ అది జరగనే లేదు. మరో బీఆర్ఎస్ బహిష్కృత నాయకుడు జూపల్లి కృష్ణారావుతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు మరో వార్త ఖమ్మం రాజకీయాలను హీటెక్కిస్తోంది. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. పొంగులేటితో భేటీ అయ్యి రాజకీయాలపై ముచ్చటించటంతో పాటు పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు. కానీ.. ఇక్కడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలైన రాజకీయం చూపించి రాహుల్ కు షాకిచ్చాడు.
ఖమ్మం జిల్లాలో తనకు పూర్తిస్థాయి పట్టు ఉన్నదనీ.. కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి అడిగినట్టు సమాచారం. హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం కూడా తన అనుచరుడికి కట్టబెట్టాలని అడిగాడట. అంతే కాకుండా మరికొన్ని షరతులను రాహుల్ ముందు పెట్టాడట పొంగులేటి. ఇవన్నీ విన్న రాహుల్ గాంధీ.. ఏం చెప్పాలో తెలియక ఆలోచించి చెప్తానంటూ చివరికి ఢిల్లీ వెళ్ళిపోయాడట. కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఓట్లు ఉన్నాయి. కాబట్టి తమ సొంత ఓటు బ్యాంకుతో పాటు పొంగులేటికి ఉన్న రాజకీయ చరిష్మా తోడైతే ఖమ్మంలో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పెద్దలు భావించి పొంగులేటిని పార్టీలోకి రమ్మన్నారు. కానీ పొంగులేటి డిమాండ్ల చిట్టా చూసి ఈ వ్యవహారం తేలేది కాదులే అని సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట.