చాలా రోజులుగా బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరబోతున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. శనివారం ఉదయం కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీతో ఈ ఇద్దరు నేతలూ జూమ్ కాల్ ద్వారా రాహుల్ తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. గతంలోనే వీళ్ళిద్దరూ రాహుల్ గాంధీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. తమకు ఖమ్మం జిల్లాలో కావాల్సిన సీట్లు తదితర అంశాలపై తమ డిమాండ్లను రాహుల్ గాంధీ ముందు ఉంచగా.. వీరి డిమాండ్లు వర్కౌట్ అయ్యే అవకాశం లేదంటూ రేవంత్ రెడ్డి చెప్పటంతో వీళ్ళ కాంగ్రెస్ చేరికకు బ్రేక్ పడింది. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా వీళ్ళతో సంప్రదింపులు జరిగినా.. అప్పుడు కూడా చర్చలు తప్ప మరేమీ జరగలేదు. చివరకు ఈటెల రాజేందర్ స్వయంగా వీరిద్దరూ బీజేపీలో చేరే అవకాశం లేదంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచీ వీళ్ళు ఎటూ తేల్చకుండా విషయాన్ని నాన్చుతూనే ఉన్నారు.
చివరకు ఈ రోజు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ సారి రాహుల్ తో చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. మరో వైపు రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. కీలక అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ జరగుతున్నదని కాంగ్రెస్ వర్గాల మాట. అయితే.. రేవంత్ సీనియర్లతో చర్చించబోయేది పొంగులేటి, జూపల్లి చేరిక గురించే అనే మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా.. వీళ్ళ చేరిక వాళ్ళంతట వాళ్ళే స్వయంగా ప్రకటించేంత వరకూ నమ్మలేం. సొంత జిల్లాలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా మరీ ఇంత సాగదీత మంచిది కాదు అనేది వాళ్ళ అనుచరులే అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. ఈసారైనా ఈ జంట కవులు కాంగ్రెస్ లో చేరతారో లేదో చూడాలి.