గత కొద్ది రోజులుగా సొంత పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న రెబల్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరూ ఊహించని షాకిచ్చారు. వీలు దొరికినప్పుడల్లా అధినేత కేసీఆర్ తో పాటు లోకల్ లీడర్స్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్న పొంగులేటి.. నేడో రేపో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమని అంతా భావించారు. చిన్నా చితకా నేతలు కొంత మంది ఇటీవలి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవటం జరుగుతుండటం.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ వివిధ పార్టీల కీలక నేతలకు గాలాలు వేస్తున్న నేపథ్యంలో పొంగులేటి బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. కానీ పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం పొంగులేటి.. షర్మిళతో రహస్యంగా భేటీ అయ్యారు. దీంతో పొంగులేటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి వెళ్ళనున్నట్టు భావిస్తున్నారు. తనకు ఏ స్థానం నుంచి టికెట్ కావాలి.. తనతో పాటు ఎంత మంది షర్మిళ పార్టీలో చేరతారు.. ఇలాంటి కీలక విషయాలన్నింటిపైనా షర్మిళతో చర్చించిన అనంతరం పొంగులేటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
