రూపా మౌద్గిల్, రోహిణీ సింధూరి.. ఒకరు ఐపీఎస్, మరొకరు ఐఏఎస్. గత రెండురోజులుగా ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశం మొత్తానికీ పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలైపోయారు. సోషల్ మీడియాలో పర్సనల్ ఫొటోలు షేర్ చేయడంతో మొదలైన వివాదం.. ఆడియో లీకేజీల వరకూ చేరిపోయి, ఉద్యోగాలు ఊడే పరిస్థితికి వచ్చేసినా.. వెనక్కి తగ్గేది మాత్రం లేనేలేదంటున్నారు. ఈ ఇద్దరి మధ్యా వివాదం మొదలైన వెంటనే ప్రభుత్వం పిలిచి పంచాయితీ పెట్టింది.. అప్పటికీ మాటవినకపోతే వితౌట్ పోస్టింగ్ బదిలీ పనిష్మెంట్ ఇచ్చింది.. దీనికీలొంగకపోయేసరికి ఇదెక్కడిగొడవంటూ తలపట్టుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అదికూడా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఈ సివిల్ సర్వెంట్ల పంచాయితీ కర్ణాటక సర్కార్‌కు తలనొప్పిగా మారింది.
ఈ ఇద్దరి మధ్య వివాదానికి అసలు కారణం రోహిణీ సింధూరి సింగిల్ ఫొటోనే. గతంలో జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో.. ఓ రెస్టారెంట్‌లో రోహిణీ సింధూరి దిగిన ఫొటో వైరల్ అయింది. ఆ సమయంలో ఓ ఐఏఎస్ అధికారిణి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరమేంటో అని ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ ప్రశ్నించారు. ఇక్కడే ఇద్దరి మధ్య రచ్చ రాజుకుంది. ఈ వివాదం కాస్తా ఈ నెల 19న పీక్స్‌కు చేరిపోయింది. ఆ రోజున సింధూరికి చెందిన పర్సనల్ ఫొటోలను, రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి మేల్ ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ ఫొటోలు ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురూ ఎవరన్న క్లారిటీ ఇవ్వకపోగా.. ఆమెపై అవినీతి ఆరోపణలూ చేశారు.దీనిపై తాను ముఖ్యమంత్రి బొంబాయి, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
మరోవైపు.. రూపా ఆరోపణలపై రోహిణి ఘాటుగా స్పందించారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన పరువుకు భంగం కలిగించేందుకే సోషల్ మీడియా, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ సేకరించారని ఆరోపించారు. అలాగే, తాను ఫొటోలు పంపించానని ఆరోపిస్తున్న రూపా అవి ఎవరికి పంపించానో కూడా చెప్పాలన్నారు. ఇదే సమయంలో మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య అని.. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు మానసిక అనారోగ్యానికి గురైత ప్రమాదకరం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ కౌంటర్ వార్ షురూ అయింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాలతోపాటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సివిల్ సర్వెంట్ల పర్సనల్ అటాక్స్‌పై ఫోకస్ చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా బొంబాయి ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ వెంటనే కర్ణాటకలోని బీజేపీ సర్కార్ రూపా, రోహిణీలను పిలిచి మరీ పంచాయితీ పెట్టింది. ఐనప్పటికీ ఈ ఇద్దరూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా తెగేవరకూ లాగేందుకు సిద్ధపడిపోయారు.
విషయం సీరియస్ అవుతున్న వేళ.. సివిల్ వార్‌కు తెరదించాలని బొంబాయి సర్కార్ యాక్షన్‌లోకి దిగింది. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇద్దరిపై బదిలీ పనిష్మెంట్ ఇచ్చింది. అదికూడా మరోచోట పోస్టింగ్ లేకుండానే. దీంతో ఇద్దరు అధికారిణులు దారిలోకి వస్తారనే అంతా భావించారు. కానీ, జరిగిందిమాత్రం అదికాదు. అంతా సర్దుకుంది అనుకుంటున్న సమయంలో థర్డ్ పర్సన్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి పర్సనల్ ఫొటోలు కాదు ఓ సంచనల ఆడియో రూపంలో వివాదం పొలిటికల్ టర్న్ తీసేసుకుంది. తాజాగా రూపా మౌద్గిల్, సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేశారు. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి తన భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం మాజీ సీఎం కుమారస్వామి, దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే సారా మహేశ్ భూ అక్రమాలకు పాల్పడ్డారని రోహిణి సింధూరి, సామాజిక కార్యకర్త గంగరాజు గతేడాది సెప్టెంబర్‌లో ఆరోపణలు చేశారు. ఆయన ఇరువురిపై పరువు నష్టం దావా వేయడంతో డిసెంబర్‌లో కుమారస్వామి సమక్షంలో రాజీ కుదిరినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం ఆడియో వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతోంది.
ఈ ఆడియో పంచాయితీ రచ్చ చేస్తుండగానే.. రోహిణిపై రూప మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఆరోపించారు. అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నానని సమర్థించుకున్నారు. రోహిణీ సింధూరి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. దీనికికౌంటర్‌గా సోషల్ మీడియాలో రూపా మౌద్గిల్ పెట్టిన పోస్టులతో తన పరువుకు భంగం కలిగిందంటూ రోహిణి సింధూరీ కోర్టుకెక్కారు. రూపకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు, తనను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు పరిహారంగా కోటి చెల్లించాలని, 24 గంటల్లో లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కర్ణాటక సివిల్ సర్వెంట్ల పర్సనల్ వార్ టు బి కంటిన్యూ అన్నట్టుగానే సాగుతోంది.
అయితే, లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్‌ను సక్రమంగా నడపాల్సిన పొజిషన్‌లో ఉండి.. ఇలా పర్సనల్ దాడులు చేసుకోవడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. న్యాయం కోసమో, ధర్మం కోసమో పోరాడితే ఏం కాదు.. కానీ, ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఎలాంటి సందేశం ఇస్తుందన్న కనీస ఆలోచన కూడా చేయకపోవడం దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికితోడు తమ మధ్య వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలు అటు కర్ణాటక సర్కార్‌నూ ఇబ్బందిపెట్టేలా కనిపిస్తోంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.