కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ నాగ్ పూర్ లో కలకలం రేపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఒకసారి.. మళ్ళీ పది నిముషాల తర్వాత.. అంటే 11.40 గంటలకు మరోసారి గుర్తు తెలియని వ్యక్తి నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసి గడ్కరీని చంపేస్తామనీ.. అలాగే నాగ్ పూర్ లోని ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించాడట. వెంటనే గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్యాలయంతో పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతమంతా అణువణువూ తనిఖీలు చేపట్టారు. ఈ విషయాలన్నీ పోలీసులు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఇల్లు, కార్యాలయం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంది. ఫోన్ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.