వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ముఖ్యమంత్రి పదవి.. ఇలాంటి కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశాడు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ చాలా అంశాలపై స్పష్టతనిచ్చారు. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వేళ.. ఇలా అరిస్తే తాను ముఖ్యమంత్రిని కాలేననీ.. గజమాలలకు బదులు ఓట్లు వేస్తే మాత్రమే తాను సీఎం కాగలననీ ముక్కుసూటిగా చెప్పేశాడు పవన్. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు ఉంటుందని కుండ బద్దలు కొట్టేశాడు. ఏది ఏమైనా సరే ఆ రెండు పార్టీలతో కలిసే ఎన్నికలకు వెళ్తానని ఇందులో సందేహమే లేదని పూర్తి స్పష్టతనిచ్చాడు పవన్. పవన్ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే జూలై నుంచి తాను పూర్తిగా పార్టీ పనులు, వచ్చే ఎన్నికలపైనే దృష్టి సారిస్తానని తేల్చి చెప్పాడు.
మూడో పార్టీలో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి బలి కావటానికి జనసేన సిద్ధంగా లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి తప్పదని పవన్ భయపడుతున్నాడా అనే విధంగా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు. ప్రతిసారీ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని బల్లగుద్ది చెప్పే పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా అదే మాట చెప్పాడు. ముఖ్యమంత్రిని కావటం తన మొదటి లక్ష్యం కాదనీ.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించటమే తన మొదటి లక్ష్యమనీ వ్యాఖ్యానించాడు. ముందు ఎన్నికల వ్యూహం రచించటం.. పొత్తులు తేల్చటం.. గెలవటం.. ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచిస్తానంటూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్య చేశాడు. సీఎం పోస్టు అడిగే అర్హత సంపాదించి.. ఆ తర్వాత అడుగుతానన్నాడు. మొత్తానికి తన లక్ష్యం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించటం మాత్రమే అనేది బల్లగుద్ది చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులు పొత్తులు, సీట్లు, ముఖ్యమంత్రి పదవి ఎవరికి.. ఇలాంటి విషయాల్లో చాలా అనుమానాలు, పుకార్లు వినిపించేవి.. ఇప్పుడు పవన్ స్టేట్మెంట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.