అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ గా గోదావరి జిల్లాల్లో వారాహితో యాత్ర అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అటు మూడు సినిమాలు ట్రాక్ లో పెట్టిన పవన్.. ఇప్పుడు ట్రాక్ మార్చేసి వారాహి ఎక్కేస్తే సినిమాల పరిస్థితి ఏమి కాను.. అంటూ నిర్మాతలు తల పట్టుకుంటున్నారట. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోసం రోజులు కేటాయించటంతో షూటింగ్స్ పరిస్థితి ఏమిటా అని ఆలోచించిన నిర్మాతలు.. కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పవన్ యాత్ చేసేది గోదావరి జిల్లాల్లోనే కాబట్టి.. సినిమాల కోసం కావాల్సిన సీన్లను గోదావరి జిల్లాలోనే ప్లాన్ చేసుకొని.. పవన్ యాత్ర విరామంలో అక్కడే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట ప్రొడ్యూసర్స్. అవసరమైతే స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసైనా.. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలనేది ప్రొడ్యూసర్ల ప్లాన్.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ రాజకీయం స్పీడు పెంచాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. ఎలక్షన్లకు చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే సినిమాలు పక్కన పెట్టి పొలిటికల్ యాక్షన్ లోకి దిగాలని.. లేకపోతే ఈ సారి కూడా గత ఎన్నికల్లో ఫలితాలనే మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగత స్థాయిలో నిర్మాణం అనేది లేదు. ఏ నియోజకవర్గంలోనూ బూత్ స్థాయి కార్యకర్తలు పార్టీ కోసం గట్టిగా పనిచేసిందే లేదు. ఇక పొత్తులు.. అభ్యర్థుల సంగతి సరే సరి. అవి తేలేది ఎప్పుడో పవన్ కే తెలియాలి. ఏది ఏమైనా.. ఒకే సమయంలో సినిమాలు, రాజకీయాలు అనేది మాత్రం అస్సలు మంచి ప్లాన్ కానే కాదు.