నిన్న జరిగిన పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టాలకు ఆరంభం కాబోతున్నాయి. ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉన్న జనసేన టీడీపీ పొత్తు నిన్న అధికారికంగా ఖరారైనట్టే. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయనే విషయం నిన్నటితే తేలిపోయింది. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తున్నట్టే అనిపిస్తోంది. భారీ ఆధిక్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని.. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం ఏపీలో పొత్తు రాజకీయాలు తప్పనిసరి. ఎన్నికలకు పెద్దగా సమయం లేని తరుమంలో వీలైనంత త్వరగా పొత్తులు సీట్ల పంచాయతీ తేల్చేస్తే.. ఇక ఎన్నికలకు కావాల్సిన గ్రౌండ్ లెవెల్ వర్క్ పై దృష్టి సారించవచ్చు అనేది అన్ని పార్టీల కోరిక. ప్రస్తుతం జనసేన.. టీడీపీ మధ్య సీట్ల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. నిన్నటి భేటీకి ముందే పవన్.. చంద్రబాబుల మధ్య ఒప్పందం జరిగిపోయిందని సమాచారం.
ఏపీలో 175 సీట్లకు గానూ తన పార్టీకి 60 సీట్లు ఇవ్వాలని పవన్ అడిగారట. అందుకు బాబు కూడా సరేనన్నట్టు చెప్పుకుంటున్నారు. నెంబర్ ఓకే కానీ.. ఆ సీట్లు ఏవి అనేదానిపైనే రెండు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. అయితే.. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ 50 సీట్లు అడిగారని కొంత మంది అంటే.. 75 సీట్లు డిమాండ్ చేశాడని మరి కొంత మంది చెప్తున్నారు. జనసేన నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. పవన్ మొత్తంగా 60 సీట్లు అడిగాడు. అందులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే కంచుకోట లాంటి స్థానాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధించగల స్థానాలను జనసేన కోసం త్యాగం చేయాలా.. వద్దా అనేది చంద్రబాబు నాయుడు తన పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించిన తర్వాత చెప్తానని పవన్ కు హామీ ఇచ్చారట. మొత్తానికి జనసేన టీడీపీ మధ్య సీట్లు కూడా ఖరారైనట్టే కానీ.. కొన్ని సీట్ల విషయంలోనే ఇంకా డైలమాలో ఉన్నారన్నమాట. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.