షాకహోలా ఫారెస్ట్.. కెన్యాలోనే దట్టమైన అటవీప్రాంతం.. అలాంటి చోటుకీ వెళ్లాలని కూడా ఎవరూ అనుకోరు. కానీ అక్కడికి చాలామంది వెళ్లారు. వెళ్లినవారిలో చాలా తక్కువమంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.. అదికూడా కొనఊపిరితో. దీనికి కారణం ఏ అడవి మృగాలో కాదు.. ఓ మానవ మృగం. మతపెద్ద ముసుగులో కనిపించే నిలువెత్తు మృత్యువు. మూఢభక్తితో కళ్లుమూసుకుపోయిన నరరూప రాక్షసుడు. పేరు మాకెంజీ. పేరుకు మాత్రం ఫాస్టర్.. చేసినవేమో ఘోరాతీ ఘోరాలు. దాదాపుగా ప్రపంచంలోని చాలా మతాలు ఉపవాసాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతాయి. కానీ, ఈ కేటుగాడు మాత్రం ఆకలితో చస్తే జీసస్ ను చేరుకోవచ్చనీ, స్వర్గానికి వెళ్లిపోవచ్చనీ భక్తులకు నూరిపోసాడు. ఈ మాటలనూ, ఈ కేటుగాడ్నీ గుడ్డిగా నమ్మిన జనం అతడు చెప్పినట్టే చేశారు. ఫలితం.. షాకహోలా ఫారెస్ట్‌లో తవ్వేకొద్దీ మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి.
గత వారమే ఇతగాడు చేసిన ఘోరాలు బయటకు రావడం మొదలైంది. ఆకలితో చనిపోతే త్వరగా స్వర్గానికి చేరుకోవచ్చని ఓ 15 మంది అడవిలో కొన్ని రోజులుగా ఏమీ తినకుండా గడుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అడవిలోని ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితులు, ఆ దృశ్యాలూ కెన్యా పోలీసుల కడుపులో దేవేశాయి. చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను చూసి పోలీసులంతా షాకైపోయారు. ఆ 15 మందిలో అప్పటికే నలుగురు చనిపోయారు. మిగిలిన 11 మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అది ఆ 15 మందితోనే మొదలైంది కాదు, వాళ్లతోనే ముగిసింది అంతకంటే కాదు. అదే అడవిలో సామూహిక సమాధులు ఉన్నాయనే కథనాలపై ఫోకస్ చేసిన పోలీసులకు తవ్వేకొద్దీ డెడ్ బాడీలు దొరుకుతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం బాధితులకు మాకెంజీ చేసిన బ్రెయిన్ వాషేనని కెన్యా పోలీసులు గుర్తించారు.
కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ బోధకుడు మాకెంజీ ఎన్‌థాంగే.. ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢభక్తి వైపు ప్రోత్సహించాడు. జీసస్‌ను కలుసు కోవాలి అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మాకెంజీ పిలుపునిచ్చాడు. ఇలా చనిపోయిన వారిని పాతిపెడితే వారు పరలోకానికి వెళతారని, అక్కడ జీసస్‌ను కలుసుకుంటారని చెప్పాడన్నారు. ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసుకున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. షాకహోలా ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల 11న 11 మృతదేహాలు బయటపడ్డాయి. ఇదే నెల 23న మరో 26 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. అలా బయటకొచ్చిన మృతదేహాల సంఖ్య ఇప్పటివరకూ 47. ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో కూడా తెలీని పరిస్థితి.
ఇంతటి దారుణానికి కారకుడైన మాకెంజీ మాత్రం తనకేం తెలీదన్నట్టే వ్యవహరిస్తున్నారు. తాను ఎవరినీ ఆత్మహత్యకు పురిగొల్పలేదనీ.. 2019లోనే చర్చిని మూసేశానని అమాయకంగా చెబుతున్నాడు. ఈ మరణాలతో తనకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. దీంతో 47 మంది ఆహారం తీసుకోకపోవడం వల్లే చనిపోయారని నిరూపించేందుకు అధికారులు మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరోవైపు, ఫాస్టర్ మాకెంజీ గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. గత నెల తనంతటా తానే పోలీసుల వద్దకు చేరాడు. తల్లిదండ్రుల కస్టడీలోనే ఇద్దరు పిల్లలు ఉపవాసం ఉండి ఆకలితో మరణించారు. ఆ ఘటనతో పోలీసులకు లొంగిపోయాడు. ఐతే, లక్ష కెన్యన్ షిల్లింగ్‌లు జరిమానా చెల్లించి ఈ కేసు నుంచి మాకెంజీ బయటపడ్డాడు. దాని ఫలితమే ఇప్పుడు పదుల సంఖ్యలో కనిపిస్తున్న మరణాలు.
అలాంటి పిచ్చోళ్లకు బెయిల్ దొరికితే ఇలాంటి దారుణాలే చోటుచేసుకుంటాయి. దేవుడిపై భక్తి తప్పుకాదు.. ఒక్కపూట ఉపవాసంతో నష్టం లేదు. కానీ, ఇలా మూఢనమ్మకాలను అమ్ముకునేవారికి దూరంగా ఉండకపోతే మాత్రం కెన్యాలో జరిగినదారుణాలే మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం ఉంది. ఓవైపు పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంటే మాకెంజీ లాంటి వ్యక్తులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలనే పట్టుకుని వేలాడుతూ ప్రజల ప్రాణాలను హరించడాన్ని ఎలా చూడాలో అర్ధంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.