ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్ లో రోజురోజుకూ సంక్షోభం ముదురుతోంది. కరెంటు లేక రాత్రి 8 గంటలకే నగరాలన్నీ షట్ డౌన్ చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఇంతే కాదు.. పాకిస్తాన్ లో చాలా రకాల కరువు ఆ దేశ ప్రజలను పీడిస్తోంది. కానీ ఆ విషయాలు బయటకు పొక్కకుండా పాక్ మీడియాను ప్రభుత్వం కట్టడి చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘటన మనసులను కలచి వేస్తోంది. పాక్ ప్రజలు చాలా వరకు గోధుమ రొట్టెలతోనే భోజనం చేస్తారు. ఇప్పుడు అదే గోధుమ పిండి లేదా గోధుమలు దొరకక పాక్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గోధుమ పిండి కోసం లైన్లో నిల్చున్న వాళ్ళు పోటీ పడి తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పాకిస్తాన్ లో ప్రతి వస్తువుకీ రేషన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తోంది. ఈ రేషన్ షాపుల ముందు క్యూలలో ప్రతి రోజూ అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిండి కోసం క్యూలో నిల్చున్న ప్రజలు పోటీ పడటం.. తొక్కిసలాటలు జరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం అక్కడ సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఏకంగా పోలీసుల పహారాలో గోధుమ పిండి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం లేక.. దిగుబడులు జరగక అన్ని రకాల వస్తువులకు షార్టేజ్ నెలకొంది. మరో వారం రోజుల్లో పాక్ దగ్గరున్న డాలర్లు పూర్తిగా ఖర్చు అయిపోతాయనీ.. ఇక దివాలా ప్రకటించటం తప్ప మార్గం లేదనీ అంతర్జాతీయ మీడియా చెప్తోంది. కొద్ది రోజుల్లో శ్రీలంకలో జరిగిన పరిణామాలే పాకిస్తాన్ లో జరగనున్నట్టు అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఇదీ మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి.