ఆసియా కప్, వరల్డ్ కప్ లలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై గందరగోళం ముగిసిపోయింది అనుకున్న వేళ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నజం సేథి వ్యాఖ్యలు మరో సారి అదే గందరగోళాన్ని క్రియేట్ చేశాయి. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులతో చర్చించిన తర్వాత ఎట్టకేలకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏషియా కప్ తేదీలను ప్రకటించింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల షెడ్యూల్ రిలీజ్ కావటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో మ్యాచ్ ల కోసం ఎదురు చూస్తున్న వేళ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. భారత్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటించటం అనేది బోర్డు చేతిలో ఉండే అంశం కాదనీ.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమేననీ.. తమకు ఎలాంటి అధికారాలు లేవనీ వ్యాఖ్యానించాడు. దీంతో ఖచ్చితంగా జరుగుతాయని భావించిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లపై మరోసారి గందరగోళం నెలకొంది. అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో మళ్ళీ నజం సేథి వ్యాఖ్యలు దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
తొలుత ఏషియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ భావించాయి. కానీ.. ఏషియా కప్ గానీ లేదా వరల్డ్ కప్ గానీ పాకిస్తాన్ లో నిర్వహిస్తే భారత జట్టు ఆయా టోర్నమెంట్లలో పాల్గొనబోదంటూ భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. బీసీసీఐ కూడా ఇది తమ చేతుల్లో నిర్ణయం కాదనీ.. ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఐసీసీ ఏషియా కప్, వరల్డ్ కప్ వేదికను శ్రీలంకకు మార్చింది దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. తమ దేశంలో అడుగు పెట్టడానికి భారత్ కు అభ్యంతరం ఉన్నప్పుడు.. శ్రీలంకలో భారత్ తో మ్యాచ్ ఆడటానికి మేం కూడా నిరాకరిస్తున్నామంటూ నజం సేథీ తేల్చిచెప్పాడు. దీంతో ఆలోచనలో పడిన ఐసీసీ కొన్ని మ్యాచ్ లను పాకిస్తాన్ లో, కొన్ని మ్యాచ్ లను శ్రీలంకలో షెడ్యూల్ చేసింది. వరల్డ్ కప్ ను భారత్ లో షెడ్యూల్ చేస్తామని చెప్పింది. శ్రీలంకలో భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, చర్చల తర్వాత భారత్ తో ఆడేందుకు అంగీకరించింది. వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించటం పట్ల కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ భారత్ లో అడుగు పెట్టాలంటే అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి కావాలంటూ మళ్లీ నజం సేథి మాట్లాడటం క్రికెట్ అభిమానులకు షాకిచ్చింది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.