జూన్ 1న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రపై తీవ్రవాదులు దాడులు చేయబోతున్నట్టు ఇండియన్ ఇంటలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే తీవ్రవాద సంస్థ అమర్నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యత ఇద్దరు కశ్మీరీ యువకులకు అప్పగించిందనీ.. వాళ్ళకు ఇదివరకే శిక్షణ ఇవ్వటంతో పాటు ఆయుధాలు, దాడికి కావాల్సిన సూచనలు అందుబాటులో ఉంచిందనీ ఇంటలిజెన్స్ చెప్తోంది. దీంతో కశ్మీర్ లోయలో సెక్యూరిటీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. రాజౌరీ-పూంచ్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాల్లో దాడులకు అవకాశాలున్నాయని పేర్కొంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పాటు భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఆ ఇద్దరు కశ్మీరీ యువకుల ఆచూకీ కనిపెట్టేపనిలో సైన్యం నిమగ్నమైంది. ఆ యువకులు ఎవరు.. వారి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు.. వంటి విషయాలపై సైన్యం నిఘా ఉంచింది. అయితే.. దీనిపై జాతీయ మీడియాలో కథనాలే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ సైన్యం నుంచి గానీ అధికారిక సమాచారం లేదు.
ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. దేశ విదేశాల నుంచి శివభక్తులు లక్షలాదిగా ఈ యాత్రకు హాజరవుతారు. 2017లో పాకిస్తన్ కు చెందిన తీవ్రవాద సంస్థ లష్కర్ ఈ తయ్యబా అమర్నాథ్ యాత్రీకులపై దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో 8 మంది యాత్రీకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిష్టాత్మక జీ20 సదస్సును కశ్మీర్ లో నిర్వహించటం పట్ల పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు కౌంటర్ కూడా ఇచ్చింది. కశ్మీర్ లో తీవ్రవాదం అనేది లేదనీ.. కశ్మీర్ పూర్తిగా భారత్ లో అంతర్భాగమనీ చెప్పటానికే భారత ప్రభుత్వం శ్రీనగర్ లో సదస్సు నిర్వహించింది. ఎలాగైనా కశ్మీర్ లో తీవ్రవాద దాడి చేసి భారత్ కు సవాల్ విసరాలనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్టు గ్రూపుల కుట్ర. ఇటీవలే కశ్మీర్ లో ఆర్మీ వ్యాన్ పై టెర్రర్ అటాక్ జరిగి 8 మంది జవాన్లు సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ లో దాగి ఉన్న తీవ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం సెర్చ్ ఆపరేషన్లు, సోదాలు, దాడులు చేస్తూనే ఉంది.